30 ఏళ్లుగా పొజిషన్‌లో ఉన్నారని చెప్పాడు!
ABN , Publish Date - Jun 19 , 2026 | 03:12 AM
గండిపేటలో వెలుగులోకి వచ్చిన రూ.కోట్ల విలువైన భూ కుంభకోణం కేసులో అరెస్టయిన కీలక సూత్రదారి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పోలీసు కస్టడీ ముగిసింది.
లాయర్ రాధాకృష్ణ తప్పుదోవ పట్టించాడు.. నాకేం తెలియదు
పోలీసు విచారణలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు
గండిపేట కేసు.. ముగిసిన పోలీసు కస్టడీ, జైలుకు తరలింపు
హైదరాబాద్ సిటీ, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): గండిపేటలో వెలుగులోకి వచ్చిన రూ.కోట్ల విలువైన భూ కుంభకోణం కేసులో అరెస్టయిన కీలక సూత్రదారి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పోలీసు కస్టడీ ముగిసింది. బ్రహ్మనాయుడును మూడు రోజుల కస్టడీకి తీసుకున్న ఈవోడబ్ల్యూ పోలీసులు.. ఈనెల 16, 17, 18 తేదీల్లో ఆయన్ను లోతుగా విచారించారు. ఈవోడబ్ల్యూ ఏసీపీ రవీందర్ ఆధ్వర్యంలోని బృందం ఈ విచారణ చేపట్టింది. నకిలీ జీవోలు సృష్టించి ప్రభుత్వ భూమిని, ప్రైవేట్ భూమిగా మార్చి కొట్టేయాలనుకోవడం తప్పని తెలిసినా ఎందుకు ఇలాంటి మోసానికి పాల్పడ్డారు..? ఎప్పటికైనా దొరికిపోతామని తెలియదా..? ఏ ధైర్యంతో ఇలా చేశారు ? ఎంతో కింది స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన మీరు.. ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి ఇలాంటి సాహసానికి ఎలా పూనుకున్నారు..? అంటూ బ్రహ్మనాయుడుపై ఏసీపీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. అయితే ప్రశ్నలన్నింటికీ ముక్తసరిగా సమాధానం చెప్పిన బ్రహ్మనాయుడు.. తనకేమీ తెలియదని, లాయర్ రాధాకృష్ణ తనను తప్పుదోవ పట్టించాడని, అవతలి వ్యక్తులు 30 ఏళ్లుగా పోజిషన్‌లో ఉన్నారని, సాగు చేసుకుంటున్నారని చెప్పడంతో ఎక్కడా అనుమానం రాదనుకొని, నమ్మానని సమాధానం చెప్పినట్లు తెలిసింది. కాగా, గురువారంతో కస్టడీ ముగియడంతో సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించి బ్రహ్మనాయుడును పోలీసులు ఎల్‌బీనగర్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆయన్ను తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.