గండిపేట మండలంలో పొలాల పరిశీలన
ABN , Publish Date - Sep 22 , 2026 | 05:43 AM
హైరైజ్ భూములకు రైతుబంధు’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం గండిపేట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి గీత బృందం మండలంలోని వట్టినాగులపల్లి, ఖానాపూర్ గ్రామాల్లో పర్యటించి అక్కడి పొలాలను పరిశీలించారు
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో
స్పందించిన అధికారులు
రెండు గ్రామాల్లోనే పర్యటన
పదేళ్లపాటు ఇచ్చిన రైతుబంధుపై విచారణ చేపట్టాలని స్థానికుల డిమాండ్
నార్సింగ్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘హైరైజ్ భూములకు రైతుబంధు’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం గండిపేట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి గీత బృందం మండలంలోని వట్టినాగులపల్లి, ఖానాపూర్ గ్రామాల్లో పర్యటించి అక్కడి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. వట్టినాగులపల్లిలో 225 మంది, ఖానాపూర్‌లో 145 మంది రైతులున్నారని.. మొత్తం గండిపేట మండలంలో 512మంది రైతులున్నారని వారి ఖాతాల్లో ఇటీవల రైతుబంధు కింద రూ.30,16,854 జమ చేశామని వారు ధ్రువీకరించారు. అంతేకాకుండా కోకాపేటలో నలుగురికి మాత్రమే రైతుబంధు వచ్చిందని పేర్కొన్నారు. అయితే పక్షం రోజుల క్రితం ఇదే అంశంపై వ్యవసాయ విస్తరణ అధికారి గీత వివరణ ఇస్తూ కోకాపేటలో 42మంది రైతులున్నారని 9మందికి రైతుబంధు వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పుడేమో నలుగురికే వచ్చిందని చెబుతున్నారు. ఈ వైరుధ్యంపై పూర్తిస్థాయి విచారణ జరిపితే కానీ అసలు విషయాలు బయటపడేలా లేవు. గండిపేట మండలంలోని 14 గ్రామాల్లో వట్టినాగులపల్లి, ఖానాపూర్ గ్రామాలు జీఓ 111 పరిధిలోకి వస్తాయి. అంటే ఇక్కడ హైరైజ్ భవనాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండదు. వ్యవసాయం కాస్త కనిపిస్తుంది. అధికారులు కూడా తెలివిగా ఈ గ్రామాల్లోనే పర్యటించి మిగతా గ్రామాలను గాలికొదిలేశారు. మిగతా ఊళ్లలో ఎందుకు పర్యటించలేదని స్ధానికులు ప్రశ్నిస్తున్నారు. కోకాపేటలో 42 మంది రైతులు ఎక్కడున్నారో చూపాలన్నారు. భవన నిర్మాణం కోసం నాలా టాక్స్ కడితే ఆటోమేటిక్‌గా రైతుబంధు ఆగిపోతుందని విశ్రాంత రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మరి కోకాపేటలో 42 మంది ఉన్నచోట నిర్మాణాలు జరగలేదా.. జరిగితే నాలా టాక్స్ కట్టలేదా?అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.