గాంధీ సరోవార్..!
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:21 AM
జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు భూసేకరణ వివాదాస్పదంగా మారుతోంది....
వివాదాస్పదంగా మూసీ చెంతన భూసేకరణ
సంగమం వద్ద భారీగా భూములు అవసరం
ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ‘మధు పార్క్ రిడ్జ్’ వాసులు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు భూసేకరణ వివాదాస్పదంగా మారుతోంది. అవసరం లేకున్నా భారీగా భూసేకరణ చేపట్టి ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడుతోందంటూ మూసీ, ఈసీ నదుల తీరం వెంట ఏళ్లుగా నివాసముంటున్న వారు ఆరోపిస్తున్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషనే ఆ ప్రాంతవాసుల ఆందోళనకు కారణం. జంట జలాశయాలైన గండిపేట (ఉస్మాన్‌సాగర్), హిమాయత్‌సాగర్ నుంచి వచ్చే మూసీ, ఈసా నదుల పరీవాహక ప్రాంతంలో లంగర్‌హౌజ్ బాపుఘాట్ వద్ద ‘వీ’ ఆకారంలో వచ్చి నది కలుస్తుంది. ఇప్పుడు ఈ ‘వీ’ ఆకారంలోని సంగమం మధ్యలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఒకే చోట వందల ఎకరాల భూములను సేకరించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సమీపంలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులోని ఏ, బీ బ్లాకుల్లో ఉన్న 450 మంది ఫ్లాట్ల యజమానులు తమ ఇళ్లను పూర్తి ఖాళీగా చేసి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై ఆ అపార్ట్‌మెంట్ వాసులంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క, భూసేకరణ నోటిఫికేషన్‌లో పేర్కొన్న పరిహారం కూడా తక్కువగా ఉందనే వాదనలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో అదే స్థాయిలో సొంత ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ రాదని ఇళ్లను కోల్పోతున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో వచ్చినంతగా ప్రభుత్వం పరిహారం రూపంలో ఇచ్చే పరిస్థితి లేకపోవడం వల్లే భూసేకరణ అంశం వివాదంగా మారుతుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
పది రోజులుగా మానసిక వేదన
నా వయసు 71 ఏళ్లు. మధు పార్క్ రిడ్జ్‌లో 2012లో 3 బీహెచ్‌కే ఫ్లాట్ తీసుకున్నాను. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం ఇప్పుడు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇది చాలా దారుణం. ఈ విషయం తెలిసినప్పటి నుంచి పది రోజులుగా మానసిక వేదనకు గురవుతున్నాం. మా ఫ్లాట్ మాదిరి కోకాపేట్‌లో 3 బీహెచ్‌కే కట్టించి ఇస్తేనే వదిలివెళ్తాం.
- కృష్ణన్‌నారాయణ్, బీ-బ్లాక్, రిటైర్డ్ ఉద్యోగి