Share News

గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్‌తో తొలి ప్రసవం

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:36 AM

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి చరిత్రలో తొలిసారిగా ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) చికిత్స ద్వారా తొలి ప్రసవం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను ....

గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్‌తో తొలి ప్రసవం

  • ఈ నెల 7న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

అడ్డగుట్ట, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి చరిత్రలో తొలిసారిగా ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) చికిత్స ద్వారా తొలి ప్రసవం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం గాంధీ ఆస్పత్రిలో వైద్యులు మీడియాకు వెల్లడించారు. శంషాబాద్‌కు చెందిన శ్రీకాంత్‌, శృతిలకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. పిల్లలు కలుగకపోవడంతో వారు హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఫెర్టిలిటీ సెంటర్‌లో వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అయినా ఫలితంలేకుండా పోయింది. అయితే 2024 నుంచి గాంధీలోని సంతాన సాఫల్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. వీరికి అవసరమైన ఐవీఎఫ్‌ వైద్య పరీక్షలు అందించారు. ఈ క్రమంలో ఈ నెల 7న శృతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గాంధీలోని సంతాన సాఫల్య కేంద్రం వైద్యులపై ప్రజలకు నమ్మకం పెరిగిందని డీఎంఈ డాక్టర్‌ నరేందర్‌ కుమార్‌ తెలిపారు. మరో ఐదుగురు ఐవీఎఫ్‌కు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో నాలుగు చోట్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారని, వరంగల్‌లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయిలో గాంధీలోని మాతాశిశు ఆస్పత్రిలో వైద్యం అందుతోందని, ఇక్కడి వైద్యులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని గాంధీ గైనకాలజీ విభాగాధిపతి, ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ శోభ తెలిపారు. పిల్లలులేని దంపతులు సంతానం కోసం ప్రభుత్వ ఆస్పత్రుల బాటపడుతున్నారని, ఏ రాష్ట్రంలో లేని విధంగా గాంధీ ఆస్పత్రిలో సంతాన సాఫల్య కేంద్రంలో ఫలితాలు కనిపిస్తున్నాయని నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుమిత్ర తెలిపారు. 2024-25 వరకు సంతాన సాఫల్య కేంద్రానికి 27,372 మంది పరీక్షల కోసం వచ్చారన్నారు.

Updated Date - Feb 26 , 2026 | 02:36 AM