Share News

లోకల్‌ పర్చేజ్‌ పేరిట నొక్కేశారు

ABN , Publish Date - Jul 15 , 2026 | 05:40 AM

సర్కారీ దవాఖానాల్లో అత్యవసరం పేరిట చేస్తున్న ఔషధ కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరుగుతున్నాయి. అధిక ధరలకు కొనుగోలు చేయడంతో పాటు..

లోకల్‌ పర్చేజ్‌ పేరిట నొక్కేశారు

  • గాంధీలో రూ.7 కోట్ల ఔషధాలు కొని 13 కోట్లకు బిల్లులు!

  • తాజాగా ఇంటెలిజెన్స్‌ విచారణలో వెలుగులోకి వచ్చిన మందుల కుంభకోణం

  • రాష్ట్రవ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రుల్లో కలిపి గత పదేళ్లలో రూ.900-1000 కోట్ల కొనుగోళ్లు

  • వాటన్నింటిపై విచారణ జరపాలని డిమాండ్లు.. లోకల్‌ పర్చేజ్‌ బడ్జెట్‌ తగ్గించాలని సర్కారు నిర్ణయం

హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): సర్కారీ దవాఖానాల్లో అత్యవసరం పేరిట చేస్తున్న ఔషధ కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరుగుతున్నాయి. అధిక ధరలకు కొనుగోలు చేయడంతో పాటు.. అసలు కొనని ఔషధాలకు రూ.కోట్ల బిల్లులు పెడుతున్నారు. రాష్ట్ర ఖజానాకు భారీగా గండికొడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇదే తంతు నడుస్తోంది. ఇలా గాంధీ ఆస్పత్రిలో గతంలో జరిగిన ఔషధ కొనుగోలు కుంభకోణం తాజాగా బయటపడింది. లోకల్‌ పర్చేజ్‌ (స్థానిక కొనుగోళ్ల) పేరిట రూ.7 కోట్ల విలువైన ఔషధాలను కొనుగోలు చేసి.. వాటికి రూ.13 కోట్ల బిల్లులు పెట్టిన విషయం ఇంటెలిజెన్స్‌ విచారణలో వెలుగులోకి వచ్చింది. ఔషధ బిల్లులు చెల్లించనందున సర్కారీ దవాఖానాలకు మందుల సరఫరా ఆపేస్తామంటూ కొన్నాళ్ల కిత్రం ట్విన్‌ సిటీస్‌ మెడికల్‌ సప్లయర్స్‌ అసోసియేషన్‌ హెచ్చరించింది. తమకు కోట్లలో బిల్లులు రావాలని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేసింది. దాంతో ప్రభుత్వం.. ‘నిజంగా అంత పెద్దమొత్తంలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయా’ అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్‌ను రంగంలోకి దించింది. గాంధీ ఆస్పత్రిలో కొనుగోలు చేసిన ఔషధాలకు, పెట్టిన బిల్లులకు మధ్య బోలెడు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన ఇంటెలిజెన్స్‌.. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. లోకల్‌పర్చజ్‌లో అక్రమాలు వెలుగు చూస్తుండటంతో గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఈ తరహా కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేసినట్లు సమాచారం. ఇది ఒక్క గాంధీకే పరిమితం కాదని.. ఉస్మానియాలోనూ అతిపెద్ద స్థానిక కొనుగోళ్ల బాగోతం జరుగుతోందని వైద్యవర్గాలు వెల్లడించాయి. తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని బోధనాస్పత్రులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లోనూ ఇలాంటి అక్రమాలే గత పదేళ్లుగా జరుగుతున్నట్లు క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు.


ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల సరఫరాకు సర్కారు ఏటా దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తుంది. ఇందులో 80శాతం బడ్జెట్‌ను (దీన్ని సెంట్రలైజ్డ్‌ బడ్జెట్‌ అంటారు) తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు(టీజీఎంఎస్ఐడీసీ) కేటాయిస్తుంది. మిగిలిన 20 శాతం(డీసెంట్రలైజ్డ్‌ బడ్జెట్‌)లో రూ.ఐదు కోట్లు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల విభాగానికి, మిగతా బడ్జెట్‌ను ఆస్పత్రులకు కేటాయిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రులు తమ స్థానిక అవసరాల కోసం అత్యవసర పరిస్థితుల్లో ఈ బడ్జెట్‌ కేటాయింపుల నుంచి మందులు కొంటాయి. వీటినే స్థానిక కొనుగోళ్లు అంటారు. టీజీఎంఎ్‌సఐడీసీ సరఫరా చేయలేని ఔషధాలను మాత్రమే ఈ పద్దు కింద కొనాలన్న నిబంధన ఉంది. ఆస్పత్రుల్లో ఉన్న పడకల సంఖ్య, ఐపీ, ఓపీ, సర్జరీల ఆధారంగా ఈ లోకల్‌ పర్చేజ్‌ బడ్జెట్‌ను కేటాయిస్తారు. ముఖ్యంగా వైద్యవిద్య సంచాలకుల పరిధిలో ఉండే బోధనాస్పత్రులకు కోట్లలో ఈ బడ్జెట్‌ ఉంటుంది. దీనిపై కన్నేసిన ఆస్పత్రి సిబ్బంది.. తమదైన శైలిలో ఈ బడ్జెట్‌ను నొక్కేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉండే ఫార్మసిస్టులు ఈ కుంభకోణాల వెనుక ప్రధానంగా ఉంటున్నారని, వారికి ఆస్పత్రుల్లోని హెచ్‌వోడీలు సహకరిస్తున్నారని.. వారు ఔషధాలు సరఫరా చేసే ఏజెన్సీలతో కుమ్మక్కై లోకల్‌ పర్చేజ్‌ బడ్జెట్‌ను మింగేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఈ కొనుగోళ్లను సైతం ఆన్‌లైన్‌ విధానంలో చేస్తున్నారని.. రాష్ట్రంలో ఔషధాల స్థానిక కొనుగోళ్లను ఆఫ్‌లైన్‌లో చేయడం వల్లే అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


ఆర్‌సీలో ఉన్నా..

టీజీఎంఎస్ఐడీసీ రేటు కాంట్రాక్టులో ఉన్న ఔషధాలను లోకల్‌ పర్చేజ్‌ కింద కొనుగోలు చేయకూడదనే నిబంధన ఉన్నా.. కొన్ని బోధనాస్పత్రులు ఆ మందులను అధిక ధరకు కొంటున్నాయి. గాంధీ ఆస్పత్రిలో విజిలెన్స్‌ విచారణలో ఇదే అంశం బయటపడింది. అలాగే ఎమర్జెన్సీ పేరుతో కూడా అఽత్యధిక ధరకు సంబంధిత ఔషధ ఏజెన్సీల నుంచి కొంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి కార్పొరేషన్‌ సరఫరా చేయని ఔషధాలను ముందుగానే గుర్తించి, రెండు నెలలకు సరిపడా మందులను కొని నిల్వ పెట్టుకోవాలి. కానీ.. ‘‘రేపు సర్జరీ జరుగుతుంది. ఫలానా మెడిసిన్‌ కావాలి’’ అని వైద్యులు చెప్పేవరకూ ఔషధాలను కొనట్లేదు. వైద్యులు చెప్పగానే వాటిని అప్పటికప్పుడు ఎమర్జెన్సీ పేరుతో అత్యధిక ధరకు మందులు కొంటున్న విషయం కూడా బయటపడింది. ముఖ్యంగా టీజీఎంఎ్‌సఐడీసీ ఆర్‌సీలో ఉన్న ఔషధాలు నాట్‌ అవైలబుల్‌(ఎన్‌ఏ) అని చూపిన వెంటనే.. వాటిని లక్షల్లో కొంటున్నారు. ఉదాహరణకు సిరంజీలు, సెలైన్‌లు కార్పోరేషన్‌ సైట్‌లో ఎన్‌ఏ అని కనిపిస్తే చాలు.. వెంటనే లక్షల స్టాకును రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇటువంటి కొనుగోళ్లు అన్నీ లోకల్‌ పర్చేజ్‌ కిందకే వస్తాయి. ఇదంతా వ్యవస్థీకృతంగా జరుగుతోంది. ఆస్పత్రిలో ఫార్మసిస్టు, ఆర్‌ఎంవో, సీనియర్‌ అసిస్టెంట్‌, ఆఫీసు సూపరింటెండెంట్‌, ఏడీ, హాస్పిటల్‌ సూపరింటెండెంట్స్‌ అంతా కలసి కుమ్మక్కై లోకల్‌ పర్చేజ్‌ కింద అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు కొన్నిసార్లు వచ్చిన స్టాకును కూడా ఎంట్రీ చేయట్లేదు. స్టాకును ఎంట్రీ చేయకుండా.. మరోసారి పర్చేజ్‌ ఆర్డర్‌ (పీవో) ఇచ్చి కొత్తగా స్టాకు వచ్చినట్లు చూపుతున్నారు. అంటే కొనేది ఒకేసారి. కానీ 2-3 సార్లు కొన్నట్లు పీవోలిచ్చి బిల్లులు పెడుతున్నారు. ఇందుకు స్థానిక ఔషధ సరఫరా ఏజెన్సీలు పూర్తిగా సహకరిస్తున్నాయి.


మంత్రి ఆగ్రహం..

లోకల్‌ పర్చేజ్‌ కింద కొనుగోలు చేసిన ఔఽషధాలను రోగులకు వాడుతున్నారో లేదో నిర్థారించే కచ్చితమైన యంత్రాంగం అంటూ ఏమీ లేదు. దీనిపై ఎటువంటి ఆడిట్‌ కూడా జరగదు. ఇదే అక్రమార్కులకు ఆయుధంగా మారింది. దాంతో బరితెగించి ఇటువంటి కుంభకోణాలకు పాల్పడుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా 35 బోధనాస్పత్రులున్నాయి. వీటికే మెజారిటీ డీసెంట్రలైజ్డ్‌ బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. గత పదేళ్లలో అన్ని బోధనాస్పత్రుల్లో లోకల్‌ పర్చేజ్‌ కింద సుమారు రూ.900-1000 కోట్ల విలువైన ఔషధాలను కొనుగోలు చేసినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని వైద్యవర్గాలు, రోగులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా ఆస్పత్రుల్లో లోకల్‌ పర్చేజ్‌ పేరిట జరుగుతున్న అక్రమాల విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం మంత్రి దీనిపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 20 శాతంగా ఉన్న లోకల్‌ పర్చేజ్‌ బడ్జెట్‌ను 10 శాతానికి కుదించాలని నిర్ణయించారు. బోధనాస్పత్రులకు అవసరమైన అన్ని రకాల ఔషధాలనూ కార్పోరేషన్‌ నుంచే ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.

Updated Date - Jul 15 , 2026 | 05:41 AM