గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ దంపతులకు కవలలు
ABN , Publish Date - Apr 30 , 2026 | 05:47 AM
సంతానం కోసం పదేళ్లుగా నిరీక్షించిన ఆ దంపతుల కల గాంధీ ఆస్పత్రిలో సాకారమైంది. సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన గడ్డం త్రివేణి, మస్తాన్‌రావు దంపతులు...
సర్కారు వైద్యంతో సాకారమైన పదేళ్ల కల
అడ్డగుట్ట, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): సంతానం కోసం పదేళ్లుగా నిరీక్షించిన ఆ దంపతుల కల గాంధీ ఆస్పత్రిలో సాకారమైంది. సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన గడ్డం త్రివేణి, మస్తాన్‌రావు దంపతులు సంతానం కోసం ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. చివరకు గాంధీ ఆస్పత్రిలోని ఐవీఎఫ్ విభాగాన్ని ఆశ్రయించగా, బుధవారం ఈ దంపతులకు పాప, బాబు జన్మించారు. గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపిన వివరాల ప్రకారం..ఇదే చికిత్స కోసం ఆ దంపతులు కొన్ని ఆస్పత్రుల్లో 13సార్లు ప్రయత్నించినప్పటికీ సంతానం కలగలేదు. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళితే రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని వెనకడుగు వేశారు. చివరకు గాంధీ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ (మదర్, చైల్డ్) విభాగంలో వైద్యం చేయించుకుందామని నిర్ణయించుకున్నారు. గాంధీలో చికిత్స తీసుకుని, గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ వరకు ఆస్పత్రిలోనే వైద్య సేవలు అందించామని డాక్టర్ వాణి తెలిపారు. ప్రస్తుతం తల్లి శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. సమాచారం తెలుసుకున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నర్సింహా గాంధీ ఐవీఎఫ్ సెంటర్ వైద్యులను అభినందించారు.