గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ దంపతులకు బాలభీముడు!
ABN , Publish Date - May 29 , 2026 | 03:42 AM
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ కేంద్రంలో భువనగిరి జిల్లాకు చెందిన దంపతులకు గురువారం 3.6 కిలోల బరువున్న బాలభీముడు జన్మించాడు.
హైదరాబాద్ సిటీ, మే 28 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ కేంద్రంలో భువనగిరి జిల్లాకు చెందిన దంపతులకు గురువారం 3.6 కిలోల బరువున్న బాలభీముడు జన్మించాడు. రవి, సౌమ్య దంపతులకు పెళ్లయి తొమ్మిదేళ్లు గడిచినా సంతానం కలగకపోవడంతో, ప్రైవేట్ ఆస్పత్రుల్లో దాదాపు 12 సార్లు ఐయూఐ వంటి చికిత్సలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో నిరాశ చెందిన దంపతులు గతేడాది గాంధీ ఆస్పత్రిలోని ఉచిత ఐవీఎఫ్ కేంద్రాన్ని ఆశ్రయించగా, తొలిప్రయత్నంలోనే చికిత్స విజయవంతమైంది. గర్భం దాల్చినప్పటి నుంచి అవసరమైన మందులు, వైద్య పరీక్షలు సహా అన్ని గాంధీలోనే అందజేశామని డాక్టర్లు శోభ, ఫాతిమా తెలిపారు. ప్రస్తుతం తల్లీ, బాబు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చయ్యే వైద్యాన్ని, రవి, సౌమ్య దంపతులకు ఉచితంగా అందించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి వివరించారు.