Share News

గాంధీకి తెచ్చి వదిలేస్తున్నారు!

ABN , Publish Date - Apr 05 , 2026 | 05:47 AM

వృద్ధురాలు రాజవ్వకు ఇద్దరు కొడుకులు. వారు ఆమెను వైద్యం పేరుతో కొన్నాళ్ల క్రితం గాంధీ ఆస్పత్రిలో చేర్పించి కనిపించకుండాపోయారు.

గాంధీకి తెచ్చి వదిలేస్తున్నారు!

  • వృద్ధ తల్లిదండ్రులపట్ల కన్న కొడుకుల నిర్దయ

  • అనాథలుగా ఆస్పత్రిలోనే ఎంతో మంది వయోధికులు

  • బాధితుల్లో కొందరు ఆస్పత్రిలోనే దిక్కులేని చావు

  • అలాంటి వృద్ధులను గుర్తించే ప్రక్రియలో పోలీసులు

  • చిలకలగూడ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్‌ డ్రైవ్‌

  • 3 నెలల్లో పునరావాస కేంద్రానికి 50 మంది అనాథలు

అడ్డగుట్ట, ఏప్రిల్‌ 4 (ఆంరఽధజ్యోతి): వృద్ధురాలు రాజవ్వకు ఇద్దరు కొడుకులు. వారు ఆమెను వైద్యం పేరుతో కొన్నాళ్ల క్రితం గాంధీ ఆస్పత్రిలో చేర్పించి కనిపించకుండాపోయారు. పోలీసులు కుమారుడికి ఫోన్‌ చేస్తే ఎవ్వరూ లిఫ్ట్‌ చేయలేదు. గాందీ ఆస్పత్రిలో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులను వారి సంతానం చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకొచ్చి.. పత్తా లేకుండా పోతున్నారు. కనీ పెంచి పెద్దచేసి, పెళ్లిళ్లు చేస్తే.. అవసానదశలో మేం భారమయ్యామా? అంటూ రాజవ్వ, ఆమె మాదిరి ఎంతో మంది వృద్ధులు మానసికంగా కుమిలిపోతున్నారు. మరి.. కుమారులు వదిలేసి.. నా అన్నవాళ్లెవ్వరూ లేక కదల్లేని స్థితిలో ఆస్పత్రిలోనే నెలలతరబడి కాలం వెళ్లదీస్తున్న ఆ వయోధికుల పరిస్థితి ఏమిటి? దీనిపైనే పోలీసులు దృష్టిపెట్టారు. ఈస్ట్‌జోన్‌ చిలకలగూడ ఏసీపీ శశాంక్‌రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్‌డ్రైవ్‌ చేపట్టారు. ఈ బృందం గాంధీ ఆస్పత్రిలోని సెక్యూరిటీ గార్డులతో కలిసి పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. చికిత్స పొందిన తర్వాత కూడా ఆస్పత్రిలో రోజుల తరబడి అనాథలుగా ఉంటున్న వారి వివరాలను సేకరిస్తోంది. వివిధ వార్డులోని విధుల్లో ఉన్న నర్సులు, ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి, అనాథలుగా ఉన్న వారి వివరాలను ఆస్పత్రి ఔట్‌పోస్టులో ఉండే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించింది. వయోధికులతో మాట్లాడి వారి సొంతూరు, మండలం, జిల్లా పేరు, వారి పిల్లలు, బంధువుల వివరాలు తెలుసుకుంటోంది. అనంతరం ఆ వయోధికుల వివరాలతో జాబితా తయారు చేసి, వారిని వారి పిల్లల వద్దకు పంపించే దిశగా చర్యలు తీసుకుంటోంది. చిలకలగూడ పోలీసు స్టేషన్‌లోనైతే బాధిత వృద్ధుల ఫొటోలతో ప్రత్యేకంగా ఓ ఆల్బమ్‌ తయారుచేశారు. వారి పిల్లల జాడ తెలుసుకొని, వృద్ధులను వారి చెంతకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు

‘తెలుగు రాష్ట్రాల నుంచి వైద్యం కోసం గాంధీకి వచ్చిన వృద్ధులను పలకరిస్తే వారిలో చాలామంది తమను సంతానం వదిలేసి కనిపించకుండా వెళ్లిపోతున్నారు. ఇలాంటి దుస్థితి ఏ తల్లిదండ్రులకూ రాకుడదనే ఉద్దేశంతో స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నాం. అనాథ రోగుల వివరాలు సేకరించి షెల్టర్‌ హోంకు తరలిస్తున్నాం. ఇప్పటి దాకా యాబై మందిని షెల్టర్‌కు తరలించాం. పిల్లలు కూడా తల్లిదండ్రులను భారంగా భావించకుండా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారి బాగోగులు చూసుకోవాలి’ అని ఏసీపీ శశాంక్‌రెడ్డి అన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 05:49 AM