గంగమ్మ ఒడికి గణపయ్య
ABN , Publish Date - Sep 24 , 2026 | 01:36 AM
జిల్లాలో తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడిని చేరాడు. జిల్లాలో బుధవారం గణేష్ నిమజ్జనోత్సవాలు వైభవంగా నిర్వహించారు. భాజభజంత్రీలు, మంగళ వాయుద్యాలు, డప్పు చప్పుళ్ల నడుమ
జగిత్యాల టౌన్, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడిని చేరాడు. జిల్లాలో బుధవారం గణేష్ నిమజ్జనోత్సవాలు వైభవంగా నిర్వహించారు. భాజభజంత్రీలు, మంగళ వాయుద్యాలు, డప్పు చప్పుళ్ల నడుమ యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ, మహిళలు కోలాటాలతో సందడి చేస్తూ గణనాథులను ఊరేగింపుగా తరలించారు. పోయిరా బొజ్జ గణపయ్య అంటూ భక్తులు స్వామివారికి వీడ్కోలు పలికారు. జగిత్యాల పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా గణనాథుల శోభాయాత్ర సాగింది. కొత్త బస్టాండ్ నుంచి టవర్ సర్కిల్, అన్నపూర్ణ చౌరస్తా, పాత బస్టాండ్, తహసీల్ చౌరస్తా మీదుగా టవర్ సర్కిల్ చేరుకున్న విగ్రహాలను అక్కడి నుంచి మంచినీళ్ల బావి మీదుగా చింతకుంట చెరువు వద్దకు తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన క్రేన్ల సహాయంతో గణనాథులను నిమజ్జనం చేశారు. గణేష్ ఉత్సవ కమిటీ, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వాహకులకు స్వాగతం పలుకుతూ మెమెంటోలు అందజేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొని గణనాథులకు స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పటిష్ట బందోబస్తు..
నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘనటలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, పట్టణ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు శోభాయత్ర మార్గాలు, ప్రధాన కూడళ్లు, నిమజ్జన ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షించారు. మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ నిమజ్జన ప్రాంతాల్లో మున్సిపల్ ఆధ్వర్యంలో చేపట్టిన పారిశుధ్యం, విద్యుత్, తాగునీరు క్రేన్లు తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు పోలీసుల భద్రత, మున్సిపల్ శాఖ ఏర్పాట్ల మధ్య నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.
ఫమెట్‌పల్లి టౌన్: మెట్‌పల్లిలో గణనాథుడిని అంగరంగ వైభవంగా సాగనంపారు. పట్టణంలోని పుర వీధుల గుండా గణేష్ శోభయాత్ర వైభవంగా సాగింది. ఉదయం నుంచి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక వాహనంలో పట్టణంలోని వట్టివాగు వద్దకు తరలించి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, విద్యుత్, అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా డీఎస్పీ రాములు, సిఐ సురేష్ బాబు, ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.