Share News

గజ్వేల్‌ తహసీల్దార్‌ అరెస్టు

ABN , Publish Date - Mar 08 , 2026 | 04:19 AM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ తహసీల్దార్‌ కమటం శ్రావణ్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు శనివారం అరెస్టు చేశారు.

గజ్వేల్‌ తహసీల్దార్‌ అరెస్టు

  • రూ.4 కోట్ల విలువైన అక్రమాస్తుల జప్తు

  • కరీంనగర్‌లో 3 చోట్ల ఏసీబీ దాడులు

గజ్వేల్‌/కరీంనగర్‌ క్రైం, మార్చి 7 (ఆంధ్ర జ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ తహసీల్దార్‌ కమటం శ్రావణ్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు శనివారం అరెస్టు చేశారు. అంతకు ముందు శ్రావణ్‌కుమార్‌ ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లలో శనివారం ఉదయం నుంచి జరిపిన తనిఖీల్లో దాదాపు రూ.4 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు గుర్తించారు. రెండేళ్లుగా గజ్వేల్‌ తహసీల్దార్‌గా పని చేస్తున్న శ్రావణ్‌ కుమార్‌.. రోజూ కరీంనగర్‌ నుంచి విధుల నిర్వహణ కోసం గజ్వేల్‌కు వస్తారు. కరీంనగర్‌ ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 7 గంటలకు కరీంనగర్‌లోని హిందూపూర్‌ కాలనీలో ఆయన ఇల్లు, సీతారాంపూర్‌లోని ఆయన మామ ఉంకరి రాజయ్య, లక్ష్మీనగర్‌లోని తల్లి విజయ తదితర బంధువుల ఇళ్లపై మూడు బృందాలుగా దాడి చేసి, సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో లభించిన రూ.11.90 లక్షల నగదు, రూ.2,47,33,540 విలువ గల రెండిళ్లు, ఒక అపార్ట్‌మెంట్‌లో 6 ఫ్లాట్లు, నాలుగు ఇళ్ల స్థలాలు, రూ.30 లక్షల విలువైన కారు, రూ.1.60 లక్షల విలువ గల రెండు ద్విచక్ర వాహనాలను జప్తు చేశారు. మొత్తం ఆస్తుల విలువ రూ.4 కోట్లు ఉంటుందన్న ఏసీబీ అధికారులు.. బహిరంగ మార్కెట్‌లో ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్పారు. గతంలో కరీంనగర్‌ రూరల్‌ మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌గా, జిల్లా మంత్రులకు పీఏగా పని చేసిన శ్రావణ్‌కుమార్‌పై ఇంతకు ముందు కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. పదోన్నతిపై ప్రస్తుతం గజ్వేల్‌ తహసీల్దార్‌గా పని చేస్తున్నారు. హిందూపూర్‌ కాలనీలోని తన నాలుగంతస్తుల భవనంలోకి వస్తున్న ఏసీబీ పోలీసులను గుర్తించిన శ్రావణ్‌ కుమార్‌.. ఓ కవర్‌ను పక్క ఇంట్లోకి విసిరేశారు. ఈ సంగతి గమనించిన ఏసీబీ పోలీసులు సదరు కవర్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా, భారీగా నగదు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఆయనను కరీంనగర్‌ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని విజయ్‌ కుమార్‌ తెలిపారు.

Updated Date - Mar 08 , 2026 | 04:20 AM