Share News

కేసీఆర్‌ ఇలాకాలో కాంగ్రెస్‌ హల్‌చల్‌!

ABN , Publish Date - Apr 05 , 2026 | 06:03 AM

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ...

కేసీఆర్‌ ఇలాకాలో కాంగ్రెస్‌ హల్‌చల్‌!

  • గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సీఎం రేవంత్‌ ఫొటో పెట్టిన కాంగ్రెస్‌ నేతలు

  • భారీగా కాంగ్రెస్‌ శ్రేణులు.. అడ్డుకున్న పోలీసులు.. తోపులాట.. అద్దాలు ధ్వంసం

  • ఆఫీసుపై దాడి చేశారని బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

  • సీఎం ఫొటోను తొలగించిన వంటేరు

  • రేపు గజ్వేల్‌ బంద్‌కు గులాబీ పార్టీ పిలుపు

  • దాడి చేయలేదు.. తప్పుడు ప్రచారం: కాంగ్రెస్‌

గజ్వేల్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో లేదంటూ డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి కాంగ్రెస్‌ శ్రేణులతో కలసి వెళ్లి క్యాంపు ఆఫీ్‌సను ముట్టడించారు. పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి ర్యాలీగా వెళ్లి క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోను ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్దసంఖ్యలో వచ్చినట్లు తెలుసుకున్న గజ్వేల్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.రవికుమార్‌.. తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి .. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌కు చేరుకుని ఏసీపీ నర్సింహులు, సీఐలు రవికుమార్‌, రవిరాజు, లతీఫ్‌తో కలిసి కార్యాలయాన్ని పరిశీలించారు. కాంగ్రెస్‌ నాయకులు ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోను ప్రతాప్ రెడ్డి తొలగించారు. దానిని కింద పడవేస్తుండగా పోలీసులు తీసుకొని వెళ్లారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే ఇల్లు లాంటిదని, ఇంగితజ్ఞానం లేకుండా రేవంత్‌రెడ్డి ఫొటోను ఏర్పాటు చేశారంటూ మండిపడ్డారు. అనంతరం పలువురు పార్టీ నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి క్యాంపు ఆఫీ్‌సపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. సోమవారం గజ్వేల్‌ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. కాగా, గజ్వేల్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.


దాడి చేయలేదు..

క్యాంపు ఆఫీస్‌పై దాడి చేశామన్నది వాస్తవం కాదని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి అన్నారు. పోలీసులు తమను అడ్డుకునే క్రమంలో తోపులాటలో అద్దాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. మరోవైపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఘటనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆస్తిగా ఉన్న క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చిత్రపటం లేకపోవడాన్ని గమనించి తమ పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్లి చిత్రపటాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. అంతే తప్ప.. అక్కడ ఎలాంటి దాడులూ జరగలేదని, తమ కార్యకర్తలు ఎలాంటి అశాంతి సృష్టించలేదని పేర్కొన్నారు. ఈ ఘటనను కొంత మంది కావాలనే దాడిగా ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Updated Date - Apr 05 , 2026 | 06:04 AM