మహిళా కమిషన్ చైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మి?
ABN , Publish Date - May 07 , 2026 | 05:43 AM
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్‌గా జీహెచ్‌ఎంసీ తాజా మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పేరు ఖరారైనట్టు తెలిసింది. ప్రస్తుత మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద పదవీ కాలం ముగిసింది.
హైదరాబాద్, మే 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్‌గా జీహెచ్‌ఎంసీ తాజా మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పేరు ఖరారైనట్టు తెలిసింది. ప్రస్తుత మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద పదవీ కాలం ముగిసింది. నిజానికి, మహిళా కమిషన్ చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీలో పోటీ గట్టిగానే ఉంది. ప్రస్తుత చైర్మన్ నేరెళ్ల శారద తన పదవిని పొడిగించాలని కోరగా.. మరికొందరు నేతలు కూడా తమ ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే, చైర్మన్ నియామకంపై సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్ ఇటీవల నిర్వహించిన సమీక్షలో గద్వాల విజయలక్ష్మి పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కమిషన్ డైరక్టర్ల ఎంపిక కూడా కొలిక్కి రానుందని, ఒకటి.. రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ కులాల ఫెడరేషన్లు, కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ నియామకం పెండింగ్‌లో పడింది. కాగా, ఈ నియామకాల్లోనూ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన వాళ్లు ఉన్నా.. మెజార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు మొదటి నుంచీ పార్టీలో ఉన్న నాయకులకే దక్కాయన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవీ కాలం వచ్చే జూలైలో ముగుస్తుంది. వాటితో పాటు ఆర్టీసీ వంటి కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇంతవరకు జరగలేదు. పలు కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఉన్నవారిలో కొందరు డీసీసీ అధ్యక్షులూ అయ్యారు. డీసీసీ అధ్యక్షులు అయిన వారి స్థానాల్లోనూ కొత్త వారిని నియమించాల్సి ఉంది. మిగిలిన చైర్మన్ల పనితీరును జూన్ నెలలో సమీక్షించి ఎవరిని కొనసాగించాలి.. కొత్తగా ఎవరిని నియమించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.