నీతి ఆయోగ్ సెమినార్‌కు గద్వాల జిల్లా గట్టు ఎంపిక
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:56 AM
నీతి ఆయోగ్ నిర్వహించనున్న ప్రాంతీయ బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్‌కు గద్వాల జిల్లా గట్టు బ్లాక్ ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హర్షం వ్యక్తం చేశారు.
గద్వాల న్యూటౌన్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): నీతి ఆయోగ్ నిర్వహించనున్న ప్రాంతీయ బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్‌కు గద్వాల జిల్లా గట్టు బ్లాక్ ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హర్షం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ ‘అస్పిరేషనల్ బ్లాక్స్ కార్యక్రమం’ కింద దేశవ్యాప్తంగా ఎంపికైన వివిధ జిల్లాల్లో నిర్దేశిత అంశాల్లో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులను గుర్తించి ఇతర ప్రాంతాల ప్రతినిధులతో వాటిని పంచుకునేందుకు ఈ నెల 9న విశాఖపట్నంలో నీతి ఆయోగ్ ఈ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో దక్షిణ మండలం-3 పరిధిలో మొత్తం ఆరు రాష్ట్రాలు పాల్గొంటున్నాయని.. తెలంగాణ నుంచి గద్వాల, నిర్మల్ జిల్లాలు మాత్రమే ఎంపిక కావడం విశేషమని పేర్కొన్నారు. గట్టు బ్లాక్‌లో విద్యా రంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి గద్వాల జిల్లా తరఫున పాల్గొని ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు.