Share News

గాదె ఇన్నయ్య మధ్యంతర బెయిల్‌పై విడుదల

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:40 AM

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక (ఉపా) చట్టం కింద చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య శుక్రవారం మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు.

గాదె ఇన్నయ్య మధ్యంతర బెయిల్‌పై విడుదల

  • షరతులతో రెండు నెలలు అనుమతిచ్చిన హైకోర్టు

హైదరాబాద్‌/సైదాబాద్‌/జఫర్‌గడ్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక (ఉపా) చట్టం కింద చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య శుక్రవారం మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. ఇన్నయ్యకు వ్యక్తిగత, ఆరోగ్య కారణాలతో రెండు నెలల షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. గడువు ముగిసిన అనంతరం తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు నేత కాటా రాంచంద్రారెడ్డి అలియాస్‌ వికల్ప్‌ అంతిమయాత్రలో మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై ఎన్‌ఐఏ అధికారులు ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో డిసెంబర్‌ 21న ఇన్నయ్యను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్నయ్య జైలులో ఉండగానే జనవరిలో తల్లి, ఫిబ్రవరిలో తండ్రి వయోభారం, అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. వారి అంతిమయాత్రలకు కోర్టు 48 గంటలపాటు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇన్నయ్యకు జైలు అధికారులు నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇన్నయ్యకు ఏప్రిల్‌ 27న వెన్నుపూసకు శస్త్రచికిత్స జరిగింది. వైద్యులు ఫిజియోథెరపీ అవసరమని చెప్పడం, జైలులో ఆ సౌకర్యం లేకపోవడంతో.. హైదరాబాద్‌లోని తన కుమార్తె ఇంట్లో చికిత్స పొందేందుకు అనుమతి ఇవ్వాలని ఇన్నయ్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానికి హైకోర్టు సమ్మతించి జూన్‌ 5 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు రెండు నెలల పాటు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Updated Date - Jun 06 , 2026 | 04:40 AM