తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన యోధుడు గద్దర్
ABN , Publish Date - Feb 01 , 2026 | 07:16 AM
అట్టడుగు వర్గాల ప్రజల కోసం పోరాటం చేసి తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన యోధుడు గద్దర్ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొనియాడారు.
ఆయన పేరిట కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు కృషి: అడ్లూరి
రవీంద్రభారతిలో ఘనంగా గద్దర్ జయంతి వేడుకలు..
రవీంద్రభారతి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): అట్టడుగు వర్గాల ప్రజల కోసం పోరాటం చేసి తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన యోధుడు గద్దర్ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొనియాడారు. గద్దర్ ఫౌండేషన్ కోరిక మేరకు హైదరాబాద్‌లో గద్దర్ కల్చరల్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి కృషి చేస్తానని హామీనిచ్చారు. శనివారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, గద్దర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గద్దర్ 78వ జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత మంత్రి అడ్లూరి గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన మహానుభావుడు గద్దర్ అని.. ఆయన జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తానని చెప్పారు. గద్దర్ భావాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. గద్దర్ తన ఆట, పాటల ద్వారా పెద్ద ఎత్తున చైతన్యం తీసుకొచ్చారన్నారు. గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సీపీఐ కార్యదర్శి నారాయణ అన్నారు. గద్దర్ కుమారుడు సూర్యకిరణ్, సామాజికవేత్త పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. గద్దర్ పేరిట హైదరాబాద్‌లో కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ప్రొఫెసర్లు హరగోపాల్, కాశీం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, బీసీ సంఘాల నేత జాజుల శ్రీనివా్‌సగౌడ్, గద్దర్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ శాంతి సిన్హా, సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ జి.వి.వెన్నెల, తదితరులుపాల్గొన్నారు. కాగా, గద్దర్ జయంతి సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు. గద్దర్ కేవలం గాయకుడు మాత్రమే కాదని, సమాజానికి అంత:స్వరమని పేర్కొన్నారు.