ఫ్యూచర్ సిటీ దేశానికే దిక్సూచి
ABN , Publish Date - May 24 , 2026 | 05:09 AM
తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ దేశానికే దిక్సూచిగా మారబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.
నాపై దుష్ప్రచారం చిన్నాచితక విషయం
అధిష్ఠానం దృష్టిలో నేనే బెస్ట్ పీసీసీ ప్రెసిడెంట్‌ని
సీఎం, నా బంధం చూసి కొందరికి కడుపుమంట
మీడియాతో ఇష్టాగోష్ఠిలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ దేశానికే దిక్సూచిగా మారబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ వైఖరిపై విరుచుకుపడటంతో పాటు తనపై వస్తున్న కొన్ని రాజకీయ ఆరోపణలను తిప్పికొట్టారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి హైదరాబాద్ అభివృద్ధిపై దూరదృష్టి లేదని, నాడు నగ ర పరిధి పెంచడంలో వారు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. నగరం విస్తరిస్తేనే వేగంగా మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ‘హైదరాబాద్ అభివృద్ధి చెంద డం హరీశ్‌రావుకు ఇష్టం లేదా? ఆయన ఏ ఉద్దేశంతో మా ట్లాడుతున్నార’ని ప్రశ్నించారు. తెలంగాణ ప్రగతి విషయం లో కేంద్రం మొదటి నుంచి సవతితల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. తమిళనాడులో స్టాలిన్ తరహాలోనే తాము కూడా గత ప్రభుత్వానికి సంబంధించిన మంచి పథకాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు పేర్లను ఇప్పటికే ఏఐసీసీకి పంపామని, త్వరలో అధిష్ఠానం ప్రకటిస్తుందని తెలిపారు. రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ అనేది పూర్తిగా ముఖ్యమంత్రి పరిధిలోని అంశమని, అందులో తన ప్రమేయం ఏమీ ఉండదని ఒక ప్రశ్నకు సమాధానంగాచెప్పారు. ఇటీవల తనపై వస్తున్న కొన్ని ఆరోపణలు, కథనాలపై మహేశ్‌గౌడ్ దీటుగా స్పందించారు. తనపై దుష్ప్రచారా న్ని అసలు పట్టించుకోనని, ఇలాంటి చిన్నాచితక విషయాలపై వెచ్చించడానికి తన దగ్గర సమయం లేదన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు అందరికీ సమాధానాలు వాటంతటవే తెలుస్తాయని చురకలంటించారు. తాను పత్రికా స్చేచ్ఛను పూర్తిగా గౌరవించే వ్యక్తినని, మీడియాకు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉందన్నారు. గాంధీభవన్ అనేది ట్రస్ట్ ఆస్తి అని గుర్తు చేస్తూ ఏదో ఒక చానెల్ తనపై తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన అది ప్రామాణికం కాబోదన్నారు. టీపీసీసీ చీఫ్ పదవికి తాను సరైన వ్యక్తిని కాబట్టే అదిష్ఠానం తనకు బాధ్యతలు అప్పగించిందని చెప్పారు. ఏఐసీసీ దృష్టిలో తాను బెస్ట్ పీసీసీ ప్రెసిడెంట్‌నని, పార్టీ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తనను అనేకసార్లు వ్యక్తిగతంగా అభినందించారని తెలిపారు. తాను, సీఎం రేవంత్ రెడ్డి కలిసికట్టుగా సమన్వయంతో పనిచేస్తుండటంతో కొందరికి మింగుడు పడటంలేదని వ్యాఖ్యానించారు. తన పనితీరును బేరీజు వేయాల్సింది ముఖ్యమంత్రి, క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమేనని స్పష్టం చేశారు. తన మార్పు విషయంలో తుది నిర్ణయం అధిష్ఠానానిదేనని మహేశ్ గౌడ్ చెప్పారు.