Share News

ఫ్యూచర్‌ అంతా అక్కడే!

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:29 AM

విమానాశ్రయం, హైస్పీడ్‌ రైల్వే టెర్మినల్స్‌, మెట్రో స్టేషన్‌, గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారి.. వీటన్నింటికీ చేరుకునేలా గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్లు..

ఫ్యూచర్‌ అంతా అక్కడే!

  • భవిష్యత్‌ జంక్షన్‌గా మారనున్న ఫ్యూచర్‌ సిటీ.. బుల్లెట్‌ రైలు టెర్మినళ్ల ఏర్పాటు

  • బందరు పోర్టుకు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవే

  • ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా మెట్రో

  • వీటన్నింటికీ సమీపంలో భారీ మాల్స్‌

  • మహానగరంపై ఒత్తిడి తగ్గించేందుకే

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): విమానాశ్రయం, హైస్పీడ్‌ రైల్వే టెర్మినల్స్‌, మెట్రో స్టేషన్‌, గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారి.. వీటన్నింటికీ చేరుకునేలా గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్లు.. వెరసి ఫ్యూచర్‌ సిటీ ‘భవిష్యత్‌ జంక్షన్‌’గా మారనుంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్‌ సిటీ కేంద్రంగానే అభివృద్ధికి వేగంగా అడుగులు వేస్తోంది. ఫ్యూచర్‌సిటీ నిర్మాణంతోపాటు అటువైపు నివసించే వారందరికీ అవసరమైన సౌకర్యాలన్నింటినీ అక్కడే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటికే ఫ్యూచర్‌సిటీ పరిధిలోనే యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ భవనాన్ని నిర్మిస్తుండగా, పలు రంగాలను కూడా అక్కడకు తరలించనుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రకటించిన బుల్లెట్‌/హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌లకు కూడా ఫ్యూచర్‌ సిటీకి సమీప ప్రాంతాలనే సర్కారు ఎంచుకుంది. రైల్వే టెర్మినల్స్‌ ఏర్పాటు కోసం ప్రస్తుతం ఉన్న శంషాబాద్‌ విమానాశ్రయానికి దగ్గర్లో దాదాపు 500 ఎకరాల భూమిని కేటాయించనుంది. అలాగే రైల్వే సహా ఇతరత్రా కీలక అవసరాలకు మరో 50 ఎకరాలను కూడా ఈ భూమిలోనే కేటాయించనున్నారు. మరోవైపు ఇదే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మెట్రో రైలును అనుసంధానించేలా ఇప్పటికే ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఫ్యూచర్‌సిటీ నుంచి బందరు పోర్టు వరకు 291 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారి జంక్షన్‌ను కూడా వీటికి అనుసంధానించనున్నారు. వెరసి ఎయిర్‌పోర్టు, హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌, మెట్రో స్టేషన్‌, గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారికి దగ్గర్లో అటు ఇటు కలిపి భారీ మాల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్లు, 24 గంటల వ్యాపార కేంద్రాలు, కమర్షియల్‌ భవనాలను ఏర్పాటుచేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌కు శంషాబాద్‌ విమానాశ్రయం పక్కనే భూమిని ఇస్తామని చెప్పడంతోపాటు రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన క్యూర్‌, ప్యూర్‌, రేర్‌లలోనూ ఫ్యూచర్‌సిటీ అభివృద్ధినే లక్ష్యంగా ఎంచుకుంది. దీంతో భవిష్యత్‌ అంతా ఫ్యూచర్‌సిటీ వైపై ఉంటుందనే సంకేతాలు ఇస్తూ ప్రభుత్వం ముందుకెళ్తోంది.


మహానగరంపై ఒత్తిడి తగ్గేలా..

ఓల్డ్‌ సిటీ, హైటెక్‌సిటీ, సైబరాబాద్‌, నాలెడ్జ్‌ సిటీ, గచ్చిబౌలి, ఐటీ సర్కిల్‌ సహా చిన్న చిన్న పరిశ్రమలన్నీ మహానగరంలోనే ఉండడంతో విపరీత మైన రద్దీ ఏర్పడుతోంది. ట్రాఫిక్‌ అంతరాయాలు, గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోంది. వెరసి కాలుష్యం పెరగడంతోపాటు వానాకాలంలో వరదలు, వాటికి తోడు ట్రాఫిక్‌ జామ్‌ చోటుచేసుకుంటుంటాయి. దీంతో హైదరాబాద్‌పై తీవ్రభారం పడుతోందని భావించిన ప్రభుత్వం.. మహానగరంపై ఒత్తిడి తగ్గేలా చేయడంతోపాటు ఇదే స్థాయిలో మరో నగరాన్ని రూపొందించేందుకు శ్రీకారం చుట్టింది. అదే ఫ్యూచర్‌సిటీ. అయితే ఆ భవిష్యత్‌ నగరం కేవలం జనావాసాలుగా మాత్రమే కాకుండా అక్కడి ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించే అంశంపైనా దృష్టి సారించింది. అందులో భాగంగానే విమానాశ్ర యం కేంద్రంగా.. దానికి అనుబంధంగా రోడ్డు, రైలు మార్గాలను అనుసంధానించాలని నిర్ణయించింది. అందుకోసమే మెట్రో రైలును ఎయిర్‌పోర్టుకు కనెక్ట్‌ చేయనుంది. తాజాగా హైస్పీడ్‌ రైలు కారిడార్లను కూడా అక్కడే ఏర్పాటుచేసేలా ప్రభుత్వ భూమి కేటాయింపునకు చర్యలు తీసుకుంది. ఎయిర్‌పోర్టు దగ్గరే రైల్వే కారిడార్‌, మెట్రో స్టేషన్‌లను ఏర్పాటుచేయడంతో ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వివిధ అవసరాల నిమిత్తం తెలంగాణకు వచ్చిన వారికి తిరిగి వెళ్లేందుకు సౌకర్యం కలగనుంది. అక్కడే మాల్స్‌ను కూడా ఏర్పాటు చేయడం ద్వారా వ్యాపార రంగాలకు ఊతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. వెరసి క్రమక్రమంగా హైదరాబాద్‌ మహానగరంపై ఒత్తిడిని తగ్గుతుందని అంచనా వేస్తోంది. ఫ్యూచర్‌సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించి, ప్రతి అంశాన్నీ ఆయనే క్షుణ్ణంగా పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Feb 23 , 2026 | 02:29 AM