Share News

ఇటు రోడ్డు.. అటు రైల్వే లైన్‌

ABN , Publish Date - Aug 16 , 2026 | 06:06 AM

రాజధాని హైదరాబాద్‌ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకూ ప్రతిపాదించిన హైస్పీడ్‌ రైల్వే లైన్‌.. ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు..

ఇటు రోడ్డు.. అటు రైల్వే లైన్‌

  • ఫ్యూచర్‌ సిటీ నుంచి అమరావతికి 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే, హైస్పీడ్‌ రైల్వే లైన్‌ ప్రాథమిక అలైన్‌మెంట్లపై స్పష్టత

  • రాష్ట్రంలో 180 కిలోమీటర్లు ప్రయాణించనున్న హైస్పీడ్‌ ట్రైన్‌

  • శంషాబాద్‌, ఫ్యూచర్‌సిటీ, డ్రై పోర్టు, నాగార్జునసాగర్‌, వాడపల్లి వద్ద స్టేషన్లు

  • రాష్ట్ర పరిధిలో 2 జిల్లాలు 40 గ్రామాల మీదుగా గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే

  • పొడవు 297 కిలోమీటర్లు.. అందులో 118 కిలోమీటర్లు తెలంగాణలో

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకూ ప్రతిపాదించిన హైస్పీడ్‌ రైల్వే లైన్‌.. ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు ప్రతిపాదించిన 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలు పక్కపక్కనే వెళ్లనున్నాయి. ఈ రెండింటిలో రోడ్డు ఎడమవైపు.. రైలు మార్గం కుడివైపు ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎడమవైపు అంటే.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు ఉన్న ప్రస్తుత రహదారికి ఎడమవైపు.. ఫ్యూచర్‌సిటీ-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ఉంటుంది. కుడివైపు రైలు మార్గం ఉండనుంది. వీటికి సంబంధించిన అలైన్‌మెంట్ల విషయంలోనూ ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌-అమరావతి- చెన్నై కారిడార్‌లో శంషాబాద్‌, భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, డ్రై పోర్టు, నాగార్జునసాగర్‌ (హాలియా), వాడపల్లి దగ్గర స్టేషన్లు రానున్నాయి. ఈ లైన్‌ శంషాబాద్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ రావిర్యాల ఎగ్జిట్‌ దగ్గర నిర్మించనున్న 21 కిలోమీటర్ల కొత్త రేడియల్‌ రోడ్డుకు దగ్గర్లో ప్రారంభమయ్యే గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే వద్ద కలుస్తుంది. ఈ రైల్వే లైన్‌ పొడవు మొత్తం 760 కిలోమీటర్లు కాగా.. రాష్ట్రపరిధిలో 180 కిలోమీటర్లు ఉండనుంది. దీనికి సంబంధించి ఆ మార్గంలో పలుచోట్ల మార్కింగ్‌లు కూడా చేశారు. ఇక ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే తెలంగాణ పరిధిలో 2 జిల్లాల్లో దాదాపు 40 గ్రామాలు, ఏపీ పరిధిలో 3 జిల్లాల్లో 60 గ్రామాల పరిధిలో ఉండనుంది. దీని అలైన్‌మెంట్‌ డీపీఆర్‌ పనులు ఊపందుకున్నాయి.


రెండింటికీ కలిపే భూ సేకరణ.!

హైస్పీడ్‌ రైలు, గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాజెక్టులకు కలిపే భూసేకరణ చేయనున్నట్టు సమాచారం. వీటిలో హైస్పీడు రైలు కోసం 790 హెక్టార్ల భూమి అవసరమని, దాని నిర్మాణానికి రూ.2.24 లక్షల కోట్ల వరకూ నిధులు కావాల్సి ఉంటుందని ప్రాథమిక అంచనాల్లో తేల్చారు. ఇక, 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే కోసం ఎంత భూమి కావాలి అనేదానిపై త్వరలో ప్రాథమిక అంచనాల్లో స్పష్టత రానుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రాథమికంగా రూపొందించిన అలైన్‌మెంట్‌ ప్రకారం.. ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌)- రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) మధ్యలో ప్రభుత్వం ప్రతిపాదించిన భారత్‌ ఫ్యూచర్‌సిటీకి (ముచ్చర్ల) దగ్గర్లో ఉన్న తిప్పారెడ్డిపల్లికి కొంత దూరంలో.. కుడివైపు నుంచి ఈ రహదారి ప్రారంభమై అమరావతి పక్కనుంచి లంకెలపల్లి మీదుగా మచిలీపట్నం- బందరు పోర్టుకు అనుసంధానం కానుంది. ఈ కారిడార్‌ పొడవు ఫ్యూచర్‌సిటీ నుంచి బందరు పోర్టు వరకు 297.82 కిలోమీటర్లు ఉండనుంది. తెలంగాణ పరిధిలో 118 కిలోమీటర్ల మేర ఉండనుంది.

Updated Date - Aug 16 , 2026 | 06:07 AM