Share News

ఫ్యూచర్‌సిటీలో మెడికల్‌ సిటీ

ABN , Publish Date - Apr 28 , 2026 | 07:23 AM

దాదాపు 30 వేల ఎకరాలలో నిర్మించబోయే ఫ్యూచర్‌సిటీలో మెరుగైన వైద్య సేవల కోసం ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

ఫ్యూచర్‌సిటీలో మెడికల్‌ సిటీ

  • వైద్య సేవల కోసం ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల కల్పన: సీఎం రేవంత్‌

  • ఇకపై 24 గంటలు, 365 రోజులు వైద్య సేవలు: డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): దాదాపు 30 వేల ఎకరాలలో నిర్మించబోయే ఫ్యూచర్‌సిటీలో మెరుగైన వైద్య సేవల కోసం ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో వైద్య సేవలను మెరుగుపరచడానికి మెడికల్‌ టూరిజం పాలసీని తీసుకువచ్చామని చెప్పారు. దీంట్లో భాగంగా పెట్టుబడులు పెట్టడానికి, సేవలను విస్తరించడానికి హాస్పిటల్స్‌కు అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. మెడికల్‌ టూరిజంకు హైదరాబాద్‌ అత్యుత్తమ ప్రాంగణమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో అపోలో గ్రూపునకు చెందిన 76వ ఆస్పత్రిని మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని కార్పొరేట్‌ ఆస్పత్రులకు మార్గదర్శిగా అపోలో నిలిచిందన్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో అపోలో గ్రూప్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి అనుసరించిన మార్గం మిగిలిన వారికి ఆచరణీయమని చెప్పారు. మహిళా సాధికారితను ప్రతాప్‌ రెడ్డి ఆచరణాత్మకంగా చూపారని, తమ నలుగురు కుమార్తెలను అపోలోకు నాలుగు మూల స్తంభాలుగా నిలిపారని ప్రశంసించారు. తాను 2028 డిసెంబర్‌ 23వ తేదీ వరకూ ముఖ్యమంత్రిగా తన ఫస్ట్‌ టర్మ్‌లో ఉంటానని, ఆ లోపునే అపోలో సంస్థ ఆస్పత్రుల సంఖ్య 100కు చేరుకోవాలని, 100వ హాస్పిటల్‌ ప్రారంభోత్సవానికి కూడా తనను పిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి అభిలషించారు.


మంత్రి దామోదర మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఒక్కో కుటుంబానికి అందించే రూ.5లక్షల విలువైన చికిత్సలను రూ.10 లక్షలకు పెంచడంతో పాటు మరిన్ని శస్త్రచికిత్సలను ఈ పథకం కిందకు తీసుకువచ్చామని గుర్తుచేశారు. ప్రతి 35 కిలోమీటర్లకు ఓ ట్రామా కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డాక్టర్‌ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. తాము ఓ హాస్పిటల్‌ను నిర్మిస్తున్నామంటే, అది కేవలం ఒక భవనం కాదని, ఒక ఆశను నిర్మిస్తున్నామని భావిస్తుంటామన్నారు. తాము ఎదగడానికి తోడ్పడిన సమాజానికి కృతజ్ఞతలు తెలిపేందుకు, నానక్‌రాంగూడ చుట్టుపక్కల ప్రాంతాలలోని 10 వేల మందికి ఆదివారాల్లో ఉచిత వైద్య సేవలను అందించనున్నట్లు తెలిపారు. ఇది ఉపాసన ఆలోచన అని చెప్పారు. ‘అపోలో నెవర్‌ స్లీప్స్‌’ పేరుతో 24 గంటలూ, 365 రోజులూ వైద్యసేవలను ఇకపై అందుబాటులో ఉంచుతామన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 07:24 AM