Share News

ఎకరాకు 1.24 కోట్ల పరిహారం

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:29 AM

ఫ్యూచర్‌ సిటీ గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డు నిర్మాణ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత ఉదారంగా వ్యవహరిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు కొందరికి అత్యధికంగా....

ఎకరాకు 1.24 కోట్ల పరిహారం

  • ఫ్యూచర్‌ సిటీ గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డు.. భూసేకరణలో అత్యధిక నష్ట పరిహారం

  • కనిష్ఠంగా ఎకరాకు రూ.30 లక్షల చొప్పున చెల్లింపు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)

ఫ్యూచర్‌ సిటీ గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డు నిర్మాణ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత ఉదారంగా వ్యవహరిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు కొందరికి అత్యధికంగా ఎకరాకు రూ.1.24 కోట్లు చెల్లిస్తోంది. రావిర్యాల ఔటర్‌ రింగురోడ్డు జంక్షన్‌ (ఎగ్జిట్‌ 13) ఆనుకుని ఉన్న ఈ భూములకు బహిరంగ మార్కెట్‌లో భారీగా డిమాండ్‌ ఉంది. ఇక్కడ ఎకరా రూ.10 కోట్లకుపైగానే ధర ఉన్నట్లు చెబుతున్నారు. ఫ్యూచర్‌ సిటీకి వెళ్లే గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డు ఇక్కడే ప్రారంభమవుతుంది. ఓఆర్‌ఆర్‌కు దగ్గరగా ఉన్న ఈ భూములకు ఎకరాకు రూ.3 కోట్ల చొప్పున పరిహారం ఇవ్వాలని స్థానిక రైతులు డిమాండ్‌ చేశారు. అనేక సార్లు సంప్రదింపులు తరువాత ఎకరాకు గరిష్ఠంగా రూ. 1.24 కోట్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దాదాపు 25 ఎకరాలకుపైగా భూములకు ఈ ధర చొప్పున చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఐదుగురు రైతులకు చెల్లింపులు చేసినట్లు వెల్లడించారు. అలాగే ఈ రోడ్డుకు సంబంధించిన భూసేకరణలో కనిష్ఠంగా ఎకరాకు రూ.30 లక్షల చొప్పున చెల్లింపు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రావిర్యాలలోని ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ 13 నుంచి ఫ్యూచర్‌ సిటీలోని స్కిల్‌ డెవల్‌పమెంట్‌ యూనివర్సిటీ మీదుగా ఆమన్‌గల్‌లోని ఆకుతోటపల్లి వద్ద రీజినల్‌ రింగురోడ్డు వరకు 330 అడుగుల వెడల్పుగల ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 41.5 కిలోమీటర్ల పొడవైన గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం రెండు విడతలుగా పనులు చేపట్టింది. తొలివిడత సుమారు 20కి.మీ కోసం 449 ఎకరాల 27 సెంట్ల భూమి సేకరణకు నోటిఫికేషన్‌ విడుదల చేసి పనులు మొదలుపెట్టింది. రెండో విడత 21.5 కి.మీ గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి నిర్మాణం 554.35 ఎకరాలు సేకరిస్తున్నారు. ఈ ఆరు లైన్ల గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి వెంటే ప్యూచర్‌సిటీలోని స్కిల్‌ యూనివర్సిటీ వరకు మెట్రో రైలు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.


10న ఫ్యూచర్‌ సిటీ అథార్టీ భవనం ప్రారంభోత్సవం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ప్యూచర్‌ సిటీ నిర్మాణం కోసం అథార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నగర శివార్లలోని ఆమన్‌గల్‌, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కడ్తాల్‌, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాలల్లోని 74 గ్రామ పంచాయతీల (56 రెవెన్యూ గ్రామాలు) పరిధిలోని 765.28 చ.కి.మీ విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ప్యూచర్‌ సిటీలో అథార్టీని ఏర్పాటు చేసింది. మొత్తం ప్యూచర్‌ సిటీ అథార్టీ పరిధిలో మాస్టర్‌ ప్లాన్‌-2047ని రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన కంపెనీల నుంచి ప్రతిపాదనలు కోరుతూ గ్లోబల్‌ టెండర్లు పిలిచింది. భారత్‌ ప్యూచర్‌ సిటీ విజన్‌ అండ్‌ కాంప్రహెన్సీవ్‌ మాస్టర్‌ పరిధిలో వివిధ పనుల కోసం ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించింది. ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న ప్యూచర్‌ సిటీ అథార్టీ భవన నిర్మాణ సముదాయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 10వ తేదీన ప్రారంభించనున్నారు.

Updated Date - Jun 06 , 2026 | 04:29 AM