Share News

ఫ్యూచర్‌ సిటీలో మరో ముందడుగు

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:46 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఫ్యూచర్‌ సిటీలో మరో ముందడుగు పడనుంది. ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కార్యాలయ భవనాన్ని..

ఫ్యూచర్‌ సిటీలో మరో ముందడుగు

  • నేడు ఎఫ్‌సీడీఏ కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి దుద్దిళ్ల

రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఫ్యూచర్‌ సిటీలో మరో ముందడుగు పడనుంది. ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కార్యాలయ భవనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు. ఇక నుంచి ఎఫ్‌సీడీఏ పరిపాలన మొత్తం ఇక్కడి నుంచే జరగనుంది. పెట్టుబడుల ఒప్పందాలు కూడా ఎఫ్‌సీడీఏ కార్యాలయం వేదికగా కుదుర్చుకునేందుకు సర్కారు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్‌ వెలుగులతో కార్యాలయం జిగేల్‌మనేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. రంగారెడ్డిజిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో ఎఫ్‌సీడీఏ కార్యాలయానికి గత ఏడాది సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.19కోట్ల వ్యయంతో 16,393 చదరపు అడుగుల్లో కార్యాలయాన్ని నిర్మించారు. ఎఫ్‌సీడీఏ కార్యాలయ ప్రారంభోత్సవం తర్వాత నిర్వహించే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్‌ మాట్లాడనున్నారు. ఈ మేరకు కార్యాలయ ఆవరణలోనే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల నుంచి 25వేల మందిని సభకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వర్షాకాలం దృష్ట్యా బహిరంగ సభ వేదికతోపాటు ప్రజలకు కూర్చునే ప్రాంగణమంతా వాటర్‌ఫ్రూప్‌ షామియాలను ఏర్పా టు చేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎఫ్‌సీడీఏ కమిషనర్‌ శశాంక, సీపీ తరుణ్‌జోషి తదితరులు మంగళవారం ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని పరిశీలించి, సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు.

భవిష్యత్తు తరాలకు గొప్ప పునాది: దుద్దిళ్ల

ఎఫ్‌సీడీఏ కార్యాలయ భవనం రాబోయే తరాలకు గొప్ప పునాది వంటిదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఎఫ్‌సీడీఏ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫ్యూచర్‌సిటీని గ్లోబల్‌ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాన్ని ఫోర్త్‌ సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ప్రభు త్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న ఈ ప్రాంత రైతులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 10 , 2026 | 04:46 AM