kumaram bheem asifabad- పాఠశాలలకు నిధులు విడుదల
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:49 PM
ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ, ప్రభుత్వ కార్యక్ర మాల అమలు, ఉపాధ్యాయుల శిక్షణలో కీలక పాత్ర పోషించే మండల విద్యావనరుల కేంద్రాలు, స్కూల్ కాంప్లెక్స్‌లకు రాష్ట్ర సమగ్ర శిక్షా విభాగం నిధులు మంజూరు చేసింది. గతంతో పోలిస్తే ఈ సారి ముందుగానే రావడంతో ఎంఈవోలు, హెచ్‌ఎంలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బెజ్జూరు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ, ప్రభుత్వ కార్యక్ర మాల అమలు, ఉపాధ్యాయుల శిక్షణలో కీలక పాత్ర పోషించే మండల విద్యావనరుల కేంద్రాలు, స్కూల్ కాంప్లెక్స్‌లకు రాష్ట్ర సమగ్ర శిక్షా విభాగం నిధులు మంజూరు చేసింది. గతంతో పోలిస్తే ఈ సారి ముందుగానే రావడంతో ఎంఈవోలు, హెచ్‌ఎంలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక్కో ఎమ్మార్సీకి రూ.90వే ల చొప్పున, సీఆర్సీలకు రూ.43వేల చొప్పున విడుదల చేశారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పాఠశాలలకు నిధులు విడుదల చేయడంతో ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
- వేటికి ఖర్చు చేయాలంటే..
పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీల సంయుక్త ఖాతాలో నిధులు జమ చేస్తున్నారు. కమిటి తీర్మానం మేరకు వీటిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. గదులకు అవసరమైన మరమ్మత్తులు చేయించడం, శుభ్రత, ప్రయోగశాలలకు పరికరాలు, స్టేషనరీ, పత్రికలు, పాఠశాల సమావేశాల నిర్వహణ, జాతీయ పండగలు, కంప్యూటర్లు, ప్రొజెక్టర్ల నిర్వహణ, ఇంటర్నెట్, డిజిటల్ తరగతులకు వెచ్చించాలి. నిధులు మొత్తం రావడంతో ఇక పాఠశాలల సమస్యలు తీరనున్నాయి.
పిల్లల సంఖ్య ఆధారంగా....:
జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 715 ఉన్నాయి. ప్రభుత్వం నిధులను విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలకు కేటాయిస్తోం ది. 1-30మంది పిల్లలున్న బడులకు రూ.10వేలు, 31-100వరకు రూ.25వేలు, 101-250 వరకు రూ.50వేలు, 251-1000వరకు ఉన్న పాఠశాలలకు రూ.75వేలు, వెయ్యికిపైగా ఉంటే రూ.లక్ష ఏటా నిర్వహణ నిధులు మంజూరు చేస్తోంది. గతంలో ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు వేర్వేరుగా వచ్చేవి. ఐదేళ్ల కిందట సదరు రెండు శాఖలను కలిపి సమగ్ర శిక్షాగా మార్చారు. పిల్లల సంఖ్యకు అనుగుణంగా బడులకు నిధులు కేటాయించారు. జిల్లాలో మొత్తం 715పాఠశాలలు ఉండగా, పాఠశాలలకు మొత్తం నిధులు రూ.77,10,000, ఎమ్మార్సీలు 15ఉండగా వాటికి రూ. 13.50లక్షలు, సీఆర్సీలు 67ఉండగా వాటికి 28.81లక్షల నిధులు ఆయా ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. కాగా గత ఏడాది రెండు విడతలుగా నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఒకేసారి వందశాతం నిధులు విడుదల చేసింది. ప్రస్తుతం మంజూరు చేసిన నిధుల్లో ఖర్చులకు సంబంధించి రికార్డులు, రశీదులు తప్పనిసరిగా ఉండాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇబ్బందులు తప్పాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో వారికి ఆర్థిక భారం తప్పినట్లయింది.