Share News

సాగర్‌ కాల్వల్లో నిండుగా ప్రవాహం

ABN , Publish Date - Aug 28 , 2026 | 06:08 AM

నాగార్జునసాగర్‌ పరిధిలో కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదలను పెంచారు. బుధవారం ఉదయం కుడికాల్వ ద్వారా 2వేల క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 500క్యూసెక్కుల నీటిని తెలుగు రాష్ట్రాల నీటి పారుదలశాఖ అధికారులు విడుదల చేశారు.

సాగర్‌ కాల్వల్లో నిండుగా ప్రవాహం
Sagar Kaaluva

  • నీటి విడుదల పెంపు...

  • కుడి కాల్వకు 7,381,ఎడమ కాల్వకు 2,067 క్యూసెక్కులు

  • మాచర్లలో పాలధారలా ఎత్తిపోతల జలపాతం

  • 70 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు.. పర్యాటకుల సందడి

  • నాగార్జునసాగర్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ పరిధిలో కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదలను పెంచారు. బుధవారం ఉదయం కుడికాల్వ ద్వారా 2వేల క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 500క్యూసెక్కుల నీటిని తెలుగు రాష్ట్రాల నీటి పారుదలశాఖ అధికారులు విడుదల చేశారు. గురువారం ఉదయం నుంచి రెండు కాల్వలకు నీటి విడుదలను గంటగంటకూ పెంచుతూ సాయంత్రానికి కుడికాల్వకు 7381 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 2,067 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590అడుగులు (312.0450టీఎంసీలు) కాగా, గురువారం సాయంత్రానికి 537 అడుగులుగా (182.1330 టీఎంసీలు) నమోదైంది. సాగర్‌ నుంచి కుడి కాల్వ ద్వారా 7,381 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 2,067 క్యూసెక్కులు, జంటనగరాల తాగునీటి అవసరాల కోసం ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 11,448 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తితో 17,738 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరింది. సాగర్‌ జలాశయానికి కుడివైపున ఉన్న ఏపీ పల్నాడు జిల్లా మాచర్ల మండల పరిధిలోని ఎత్తిపోతల జలపాతం జలకళ సంతరించుకోవటంతో సాగర్‌లో పర్యాటకుల సందడి మొదలైంది. బుధవారం రాత్రి నల్లమల అటవీప్రాంతంలో కురిసిన వర్షానికి వాగులు, వంకల ద్వారా వర్షపు నీరు ఎత్తిపోతల జలపాతంలో కలుస్తోంది. దీంతో ఆరు నెలలుగా నీళ్లు లేక బోసిపోయిన ఎత్తిపోతల జలపాతం జలకళ సంతరించుకుంది. 70 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు పాలధారలా జాలువారుతుండటంతో ఎత్తిపోతల జలపాతం అందాలను తిలకించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.

Updated Date - Aug 28 , 2026 | 06:08 AM