పెట్రోల్, డీజిల్ ‘నో స్టాక్!’
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:38 AM
పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఏర్పడిన కొరతతో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖమ్మం .....
ఉమ్మడి ఖమ్మం జిల్లా, హైదరాబాద్‌లో ‘ఇంధన కష్టాలు’
వాహనదారుల పడికాపులు.. కిలోమీటర్ల మేర వాహనాల క్యూ
దాదాపు 80 శాతం బంకుల్లో నిల్వలు లేవు
ఖమ్మం కలెక్టరేట్ /కొత్తగూడెం అర్బన్/హైదరాబాద్ సిటీ/మూసాపేట్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఏర్పడిన కొరతతో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ఆదివారం ఉదయం నుంచే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు 80శాతం బంకుల్లో డీజిల్, పెట్రోల్ నిల్వలు నిండుకోవడంతో.. నిర్వాహకులు నోస్టాక్ బోర్డులు పెట్టి చేతులెత్తేశారు. వైరా రోడ్డు, బైపాస్ రోడ్లతో పాటు వరంగల్, కోదాడ క్రాస్‌రోడ్డు వంటి ప్రధాన ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులన్నీ రద్దీగా మారాయి. పెట్రోల్ నిల్వలు అయిపోతున్నాయన్న వదంతులతో వేకువజాము నుంచే ప్రజలు బంకుల వద్దకు పరుగులు తీయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొన్నిచోట్ల పోలీసుల జోక్యం అవసరమైంది. అటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వరికోతలు, వ్యవసాయ పనులు ముమ్మురంగా సాగుతున్న వేళ.. ఈ డీజిల్ కొరత అన్నదాతల పాలిట శాపంగా మారింది. ట్రాక్టర్లు ఇతర వ్యవసాయ యంత్రాలు డీజిల్ అందక నిలిచిపోవడంతో.. పనులన్నీ అకస్మాత్తుగా ఆగిపోయాయి. దీంతో పంట కోతలు సకాలంలో పూర్తిచేయలేక తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొరత అధిగమించాలి: మంత్రి తుమ్మల
జిల్లాలో ఏర్పడిన ఇంధన కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్.. ఆదివారం జిల్లా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆయిల్ కంపెనీలు ఇంధనాన్ని సకాలంలో సరఫరా చేయడం లేదని డీలర్లు జేసీకి వివరించారు. దీంతో ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడిన అదనపు కలెక్టర్.. పరిస్థితిని మంగళవారం నాటికి చక్కబెట్టాలని సూచించినట్లు సమాచారం.
హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇంధన కొరత తీవ్రంగా కనిపించింది. సాయంత్రం ఐదింటి తర్వాత నుంచి ఒక్కసారిగా ఈ పరిస్థితి నెలకొంది. ఏపీలోని పలు జిల్లాల్లో రెండు రోజులుగా పెట్రోల్ కొరత నెలకొందన్న సమాచారం తో.. ఆదివారం షేక్‌పేట్, గచ్చిబౌలి, మాదా పూర్, కూకట్‌పల్లితోపాటు పలు బం కులు వద్దకు పెద్ద సంఖ్యలో క్యూకట్టారు. కాగా, జేఎన్‌టీయూ ఎదురుగా ఉన్న ఓ బంకు సాయంత్రం 5గంటలకే మూతపడింది. అలాగే, బాలానగర్ మెట్రో స్టేషన్, చిత్తారమ్మ దేవాలయం సమీపాన బంకుల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది.