Share News

సర్వర్‌ రూం దగ్ధమైంది

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:48 AM

తెలంగాణ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి నాంపల్లి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలను ప్రస్తావించడం సంచలనం సృష్టిస్తోంది.

సర్వర్‌ రూం దగ్ధమైంది

  • పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో నమోదు.. వేల కేసుల సమాచారమంతా అందులోనే

  • సైబర్‌ నేరాల కేసుల్లోనూ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికలదే కీలకపాత్ర

  • ప్రమాదంపై అధికారులదో మాట..ఎఫ్‌ఐఆర్‌లో మరో లెక్క

  • కుట్ర కోణమా? షార్ట్‌ సర్క్యూటా?

  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు

హైదరాబాద్‌, ఫిబ్రవరి8 (ఆంధ్రజ్యోతి) తెలంగాణ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి నాంపల్లి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలను ప్రస్తావించడం సంచలనం సృష్టిస్తోంది. ఎఫ్‌ఎ్‌సఎల్‌లో పనిచేస్తున్న సీఐ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు శనివారం రాత్రి క్రైం నంబర్‌ 48 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎఫ్‌ఎ్‌సఎల్‌లో జరిగిన నష్టానికి సంబంధించిన కీలకమైన విషయాలను అందులో ప్రస్తావించారు. కీలకమైన సర్వర్‌రూం ధ్వంసమైందని ఫిర్యాదులో స్పష్టం గా పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎఫ్‌ఎ్‌సఎల్‌లో పనిచేస్తున్న సీఐ శ్రీనివాసరెడ్డి ఆఫీసుకు వచ్చే దారిలో ఉండగా నాలుగో తరగతి ఉద్యోగి సాయికృష్ణ ఫోన్‌ చేసి కంప్యూటర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో ని ప్రాపర్టీ రూంలో దట్టమైన పొగలు వస్తున్నాయని చెప్పారు. దీంతో సీఐ అప్రమత్తమై ఫైర్‌ సర్వీసుకు సమాచారం ఇచ్చి, మంటలను అదుపు చేయడానికి అక్కడున్న అగ్నిమాపక సాధనాలతో ప్రయత్నించాలని సాయికృష్ణకు సూచించారు. ఉదయం 10:30 గంటలకు వివిధ ఫైర్‌ స్టేషన్ల నుంచి ఐదు ఫైరింజన్లతో అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పటికే మంటలు మొదటి అంతస్తులోకి పూర్తిగా వ్యాపించాయి. రెండో అంతస్తులో కీలకమైన కెమికల్‌ లేబొరేటరీ ఉండటంతో దానికి మంటలంటుకుంటే ప్రమాద తీవ్రత భారీగా ఉంటుందనే ఆందోళనల మధ్య మొత్తం భవనానికి మంటలు వ్యాపించకుండా చూసుకుంటూ మధ్యాహ్నం ఒకటిన్నరకు మంటలను అదుపు చేయగలిగారు. ఆ తర్వాత ఎఫ్‌ఎ్‌సఎల్‌ జా యింట్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ గౌడ్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రావు, ఇన్‌చార్జి సైంటిఫిక్‌ ఆఫీసర్‌ అంజనా ఇతర సిబ్బందితో కలిసి మొదటి అంతస్తులోకి వెళ్లి ఏమేం కాలిపోయాయో అన్న వివరాలను పరిశీలించారు. కంప్యూటర్‌ ఫోరెన్సిక్‌ లేబొరేటరీలోని కీలకమైన ప్రాపర్టీరూం, కేస్‌ వెరిఫికేషన్‌ చాంబర్‌, అనాలిసిస్‌ చాంబర్‌, సర్వర్‌రూంలు ధ్వంసమైనట్లు గుర్తించారు.


హెచ్‌ఆర్‌డీ హాలు అందులోని ఫర్నిచర్‌, కొన్ని పరికరాలు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి.సర్వర్‌రూం అగ్నిప్రమాదంలో దగ్ధమైనట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడంతో ఇందులోని కీలక సమాచా రం బ్యాక్‌అ్‌పపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని కేటీఆర్‌ సైతం విలేకరుల సమావేశంలో ప్రస్తావించడం గమనార్హం. ఇదిలా ఉండగా ఎఫ్‌ఎ్‌సఎల్‌ ఘటనపై ఎఫ్‌ఎ్‌సఎల్‌ డైరక్టర్‌ శిఖాగోయల్‌ జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఆడిటింగ్‌ నిర్వహిస్తున్నామని చెబుతూ రెండు కేసులపైనే ఫోకస్‌ చేస్తూ మాట్లాడారు. దీంతో, వేలాది ఇతర కేసులకు సంబంధించిన సమాచారం కోసం ఈ కేసులతో ముడి పడి ఉన్న వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కంప్యూటర్‌ ఫోరెన్సిక్‌ లేబొరేటరీకి తెలంగాణలోని వివిధ పోలీసు స్టేషన్లు, సైబర్‌ క్రైం నేరాలకు సంబంధించిన కేసులు, న్యాయస్ధానాలు నుంచి పంపించిన మెటిరియల్‌ అబ్జెక్ట్స్‌ వస్తుంటాయి. కీలకమైన సర్వర్‌రూం తగలబడటం వెనుక కుట్ర కోణం ఉందా? షార్ట్‌ సర్క్యూట్‌తోనే అగ్నిప్రమాదం జరిగిం దా? మంటలను ఎందుకు అదుపుచేయలేకపో యారు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ప్రమాదం వెనుక రాజకీయ కుట్ర: సుభాష్‌

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం వెనుక రాజకీయ కుట్ర ఉందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ సుప్రీం కోర్టులో కీలకదశకు చేరుకున్న దశలో ఈ ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందని ఆయన మీడియాతో అన్నారు.

Updated Date - Feb 09 , 2026 | 02:48 AM