Share News

సపోటా స్కాచ్‌.. జామ జిన్‌!

ABN , Publish Date - Jul 07 , 2026 | 04:26 AM

ధరలు లేక.. రవాణా చార్జీలు కూడా గిట్టుబాటవ్వని దయనీయస్థితిలో రైతులు రోడ్ల పక్కన పూలను గుట్టలు గుట్టలుగా పారబోస్తుండటాన్ని చూస్తుంటాం...

సపోటా స్కాచ్‌.. జామ జిన్‌!

  • పూలు, పండ్లు, కూరగాయలతో మద్యం, బయోఇథనాల్‌ ఉత్పత్తి.. రైతుకు అదనపు రాబడి

  • కుళ్లిన వ్యర్థాలే ఈ మార్కెట్‌కు ముడిసరకు

  • టమాటా, పుచ్చకాయ, మామిడి, బంతిపూలకు రేట్లు పడిపోయినప్పుడు యూనిట్లే కొంటాయి

  • క్రాఫ్టెడ్‌ లిక్కర్‌, బయో ఇథనాల్‌ ఉత్పత్తికి వాణిజ్య పరంగా కీలక ముందడుగు

  • హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న సీఎస్ఐఆర్‌-నిస్ట్‌

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ధరలు లేక.. రవాణా చార్జీలు కూడా గిట్టుబాటవ్వని దయనీయస్థితిలో రైతులు రోడ్ల పక్కన పూలను గుట్టలు గుట్టలుగా పారబోస్తుండటాన్ని చూస్తుంటాం! కొన్నిసార్లు పాపం కూరగాయల రైతులు కూడా! టమాటాల ధరలు పాతాళానికి పడిపోయిన ప్రతిసారి ఆ రైతులు రోడ్ల పక్కన రాశులుగా పారబోసి ఖాళీ చేతులతో నిరాశగా వెళుతుండటమూ మన కంటపడుతుంది!! మున్ముందు రైతులకు ఇటువంటి గడ్డు పరిస్థితులుండవు! కుప్పలకొద్దీ పూలు, టమాటాలను మద్యం, బయో ఇథనాల్‌ తయారీ కోసం తరలించేందుకు వ్యాపారులే ఎగబబడి కొనే పరిస్థితి రావొచ్చు! మార్కెట్‌లో అమ్ముడవ్వక వృథాగా ఉండే పండ్లు, కుళ్లిన పూలు, కూరగాయలతో ప్రత్యేకమైన క్రాఫ్టెడ్‌ లిక్కర్‌, బయో ఇథనాల్‌ను వాణిజ్యపరంగా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు సరికొత్త అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థ (సీఎస్ఐఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్‌ డిసిప్లినరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (నిస్ట్‌) హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బయోటెక్నాలజీ స్టార్టప్‌ సంస్థ ‘3కజిన్‌ ల్యాబ్స్‌(3సీఎల్‌)’తో అధికారికంగా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. తిరువనంతపురంలో ఇటీవల జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సీఎస్ఐఆర్‌-నిస్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సి.ఆనందరామకృష్ణన్‌, 3కజిన్‌ల్యాబ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.శ్రీనివాస్‌ ఈ ఒప్పంద పత్రాలను ఇచ్చిపుచ్చుకున్నారు. అక్కడ ‘పండ్ల గుజ్జు, రసాల నుంచి ఇథనాల్‌ ఉత్పత్తి- పైలట్‌- స్కేల్‌ సాధ్యాసాధ్యాల అధ్యయనాలు’ అనే అంశంపై జాతీయస్థాయి ప్రాజెక్టు ప్రారంభమైంది.

ఇతర రాష్ట్రాల పాలసీలపై స్టడీ

ఈ వినూత్న మద్యం, ఇథనాల్‌ పాలసీకి సంబంధించి తెలంగాణ ఎక్సైజ్‌శాఖ ఇప్పటికే ప్రభుత్వ పెద్దలతో కీలక చర్చలు జరిపింది. ఈ సరికొత్త పాలసీని ఎక్సైజ్‌శాఖలో కొత్తగా సృష్టించవద్దని, తొలుత దీనిపై బయటి రాష్ట్రాల్లో ఎలాంటి నిబంధనలున్నాయో అధ్యయనం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్కడ అమలవుతున్న తీరుపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఫలితంగా ఎక్సైజ్‌శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం యూపీ, మహారాష్ట్ర సహా మరికొన్ని రాష్ట్రాల్లో పండ్ల ఆధారిత మధ్యం/ఇథనాల్‌ విధానాలు, అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ రాష్ట్రాల నుంచి వచ్చే సమగ్ర నివేదికల ఆధారంగానే మన రాష్ట్రంలో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం.


పండ్ల తోటలకు భరోసా

తెలుగు రాష్ట్రాల్లో సీజన్‌ను బట్టి మామిడి, పుచ్చకాయ, టమాటా, పనస, అనాస (ఫైనాపిల్‌) వంటి పంటలు రికార్డు స్థాయిలో పండుతాయి. అయితే.. సరైన కోల్డ్‌ స్టోరేజ్‌ సౌకర్యాలు లేకపోవడం వల్ల టన్నుల కొద్దీ పండ్లు కుళ్లిపోతుంటాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సీసీఎంబీ మెడికల్‌ బయోటెక్నాలజీ కాంప్లెక్స్‌లోని ‘అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌’లో ఇంక్యుబేట్‌ అయిన ‘3కజిన్‌ ల్యాబ్స్‌’ సంస్థ ఈ పండ్ల వ్యర్థాల గుజ్జు, రసాల నుంచి ఇథనాల్‌ తయారు చేసే వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఆ సరికొత్త ఫార్ములాను వాణిజ్యపరంగా గ్లోబల్‌ మార్కెట్లోకి తీసుకురావడానికి ‘నిఫ్ట్‌’ శాస్త్రవేత్తలు ఇప్పుడు రంగంలోకి దిగారు. ఈ ప్రాజెక్ట్‌ కింద నిస్ట్‌ ల్యాబ్‌లలో 150 నుంచి 200 లీటర్ల చొప్పున భారీ బ్యాచ్‌లుగా పైలట్‌ ప్రాజెక్ట్‌ ట్రయల్స్‌ నిర్వహించి, సాంకేతికతను నిరూపించనున్నారు. దీని ద్వారా వచ్చే ఇంజనీరింగ్‌, ప్రాసెస్‌ డేటా ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లాల వారీగా వికేంద్రీకృత చిన్నతరహా బయో ఇథనాల్‌ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా పూలు, పండ్లు, కూరగాయలతో చేసే వినూత్న మద్యానికి, క్రాఫ్ట్‌ స్పిరిట్స్‌కు భారీ డిమాండ్‌ ఉంది. గత నివేదికల ప్రకారం.. ఈ మార్కెట్‌ విలువ దాదాపు 3.4 బిలియన్‌ డాలర్లు (రూ.30వేల కోట్లు) కాగా.. రానున్న రోజుల్లో ఇది మరింత పెరగనున్నట్లు సమాచారం. యూర్‌పలో ఫ్లవర్‌ జిన్‌, స్పెయిన్‌, ఇటలీలలో టమాటా, బీట్‌రూట్‌లతో చేసే వోడ్కా, లిక్కర్లకు గ్లోబల్‌ మార్కెట్‌లో విపరీతమైన ఆదరణ ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఉద్యానవన పంటల ఆధారంగా ‘3కజిన్‌ల్యాబ్స్‌’ సంస్థ మామిడి, పైనాపిల్‌, పుచ్చకాయ, పనస, టమాటాలతో సహజసిద్ధమైన సువాసనలతో కూడిన క్రాఫ్టెడ్‌ బయో ఇథనాల్‌ తయారీకి నిస్ట్‌ భాగస్వామ్యంతో రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తోంది.

వ్యర్థాల నుంచి సంపద

మార్కెట్‌కు పనికిరాని, కాస్త దెబ్బతిన్న, అమ్ముడుపోని పండ్లను కూడా రైతులు, ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌పీవో) ఈ తయారీ కేంద్రాలకు అమ్మి అదనపు ఆదాయం పొందొచ్చు. భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌ (ఈబీపీ) కార్యక్రమానికి ఈ పరిశోధన మరింత బలాన్ని చేకూర్చనుంది. ఇప్పటివరకు కేవలం చెరకు, ధాన్యాల నుంచే కాకుండా పండ్ల వ్యర్థాల నుంచీ ఇథనాల్‌ తయారు చేయడం వల్ల దేశ ఇంధన భద్రత పెరుగుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 07 , 2026 | 05:58 AM