స్నేహితుల దినోత్సవానే వెళ్లిపోయావా నేస్తం..!
ABN , Publish Date - Aug 05 , 2026 | 05:17 AM
వారంతా మూడు దశాబ్దాల క్రితం కలిసి చదువుకున్నారు! మళ్లీ ఇన్నేళ్లకు ఒకదగ్గర చేరి.. ఆనందంగా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుచేసుకోవడం మొదలుపెట్టారు.
30 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు... గుండెపోటుతో ఒకరి మృతి
ఆమనగల్లు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): వారంతా మూడు దశాబ్దాల క్రితం కలిసి చదువుకున్నారు! మళ్లీ ఇన్నేళ్లకు ఒకదగ్గర చేరి.. ఆనందంగా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుచేసుకోవడం మొదలుపెట్టారు. అంతలోనే.. వారిలో ఒకరు గుండెపోటుతో మృతి చెందడంతో.. ఆనందం ఆవిరై విషాదం మిగిలింది. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కొత్త బ్రహ్మణపల్లిలో స్నేహితుల దినోత్సవంనాడు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఊళ్లోని బడిలో 1997-1998 సంవత్సరంలో కలిసి చదువుకున్నవారంతా.. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 2న ఆత్మీయ సమ్మేళనం జరుపుకొన్నారు. చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కొన్ని గంటలపాటు ఉత్సాహంగా గడిపారు. అంతలోనే.. పూర్వ విద్యార్థుల్లో ఒకరైన జెల్ల యాదగిరి(42)కి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. జెల్ల యాదగిరి స్వగ్రామం పాతబ్రహ్మణపల్లి అయినప్పటికీ హైదరాబాద్‌లోని ఒక నిర్మాణ సంస్థలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య మాధురి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. యాదగిరి కుటుంబాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.