Share News

Jewelry theft: అప్పులు ఎగ్గొట్టేందుకు మహిళ హత్య

ABN , Publish Date - Jan 04 , 2026 | 04:43 AM

స్నేహితురాలిని చంపితే ఆమె నుంచి తీసుకున్న అప్పులను ఎగవేయవచ్చని పథకం వేశారు తోటి మిత్రులు. బాధితురాలికి మద్యం తాగించి...

Jewelry theft: అప్పులు ఎగ్గొట్టేందుకు మహిళ హత్య

  • ఆమె హత్యకు స్నేహితుల పథకం

  • మద్యం తాగించి నగలు కాజేసే యత్నం

  • ప్రతిఘటించడంతో హత్య.. వాగులో మృతదేహం

నందిపేట, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): స్నేహితురాలిని చంపితే ఆమె నుంచి తీసుకున్న అప్పులను ఎగవేయవచ్చని పథకం వేశారు తోటి మిత్రులు. బాధితురాలికి మద్యం తాగించి, తలపై బలంగా మోది చంపేశారు. నిజామాబాద్‌ జిల్లాలో ఈ దారుణం జరిగింది. నందిపేట మండల కేంద్రంలోని సుభాష్‌ గల్లీకి చెందిన రాగల గంగామణి(40) అదే గల్లీకి చెందిన గూండ్ల స్వరూప, లావణ్య, నవీపేట మండలం జన్నెపల్లికి చెందిన ప్రేమల మంచి స్నేహితులు. వీరంతా ఎటు వెళ్లినా, ఏ పనిచేసినా ఒక్కటిగా ఉండేవారు. శుక్రవారం గంగా మణి ఇంట్లో వారంతా మద్యం తాగారు. మధ్యాహ్నం టాటూ(పచ్చబొట్టు) కోసం నిర్మల్‌ జిల్లా బాసరకు వెళ్తున్నామని గంగామణి కూతురు మేఘనకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లారు. మేఘన సాయం త్రం కాలేజీ నుంచి వచ్చి తల్లి గంగామణికి ఫోన్‌ చేస్తే స్వరూప లిఫ్ట్‌ చేసి మమ్మీకి టాటూ వేయిస్తున్నామని చెప్పింది. అయితే గంగామణి వద్ద అప్పులు తీసుకున్న స్వరూప, లావణ్య, ప్రేమల, ఆమె భర్త నరేశ్‌ కలిసి వాటిని ఎగ్గొట్టడానికి పథకం వేశారు. బాసర నుంచి వచ్చే దారిలో వారంతా గంగామణికి మద్యం తాగించి.. ఆమె నగలు కాజేసేందుకు యత్నించారు. ప్రతిఘటించడంతో గంగామణి తలపై బలమైన ఆయుధంతో కొట్టి చంపారు. మృతదేహాన్ని వాగులో పారేశారు. శనివారం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గంగామణి మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతురాలి కూతురు మేఘన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు.

Updated Date - Jan 04 , 2026 | 04:44 AM