ఉచిత చేప పిల్లల పంపిణీపై నీలినీడలు
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:16 AM
రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. చేప పిల్లల పంపిణీకి సంబంధించి ఫిష్ సీడ్ ఫార్మర్ల(కాంట్రాక్టర్లు)కు ప్రభుత్వం రెండేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో...
రెండేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో టెండర్లలో పాల్గొనబోమంటున్న ఫిష్ సీడ్ ఫార్మర్లు
జూలై నెల వస్తున్నా ప్రభుత్వ నుంచి రాని స్పష్టత
ఏటా జూన్‌లోనే టెండర్లు.. సెప్టెంబరులో చేపల పంపిణీ
కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి రూ.128కోట్లు బకాయి
జనగామ, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. చేప పిల్లల పంపిణీకి సంబంధించి ఫిష్ సీడ్ ఫార్మర్ల(కాంట్రాక్టర్లు)కు ప్రభుత్వం రెండేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో వారు ఈసారి టెండర్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. చేప పిల్లల పంపిణీ కోసం ప్రభుత్వం ప్రతీ సంవత్సరం జిల్లాల వారీగా టెండర్లను నిర్వహిస్తోంది. టెండరు దక్కించుకున్న ఫిష్ సీడ్ ఫార్మర్లు ఆయా జిల్లాల్లో చేప పిల్లలను ఉచితంగా చెరువుల్లో వదలాల్సి ఉంటుంది. తర్వాత ప్రభుత్వం వారికి డబ్బు చెల్లిస్తుంది. ఏటా జూన్, జూలై నెలల్లో టెండర్లను ఆహ్వానించి సెప్టెంబరు, అక్టోబరులో చేపలను వదులుతారు. కానీ, ఈసారి జూలై నెల దగ్గర పడుతున్నప్పటికీ టెండర్లకు సంబంధించిన, పెండింగ్ బిల్లులకు సంబంధించిన అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. దీంతో, ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అమలుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఫిష్ సీడ్ ఫార్మర్లకు రూ.128 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క జనగామ జిల్లాకు సంబంధించే రూ.4.50 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. 2023 ఏడాదికి సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు 2024 ఏడాదిలో టెండర్లకు దూరంగా ఉంటామని ప్రకటించారు. అప్పుడు ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. మూడు నెలల్లో బిల్లులు చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ, ఆ హామీని నిలుపుకోలేదు. 2025లోనూ పలువురు కాంట్రాక్టర్లు టెండర్లకు దూరం ఉండడంతో ఆంధ్రా కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో బిల్లులను చెల్లించలేదు. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం టెండర్లలో పాల్గొనేది లేదని కాంట్రాక్టర్లు అంటున్నారు.