Free Bus Travel for Disabled People: త్వరలో దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం
ABN , Publish Date - Jan 05 , 2026 | 03:18 AM
దివ్యాంగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఒక మంత్రిగా కాకుండా ఒక అన్న లా వారికి తోడుంటానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ భరోసా ఇచ్చారు.
వచ్చే ఏడాది నుంచి అంధులు, బధిరుల కోసం కాలేజీలు
అతి త్వరలోనే పెన్షన్ల పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
హైదరాబాద్/ఓల్డ్‌మలక్‌పేట, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఒక మంత్రిగా కాకుండా ఒక అన్న లా వారికి తోడుంటానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ భరోసా ఇచ్చారు. మలక్‌పేటలోని దివ్యాంగుల సంక్షేమశాఖ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన లూయీస్ బ్రెయిలీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రెయిలీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఫోన్‌లో మాట్లాడిన అడ్లూరి.. ఈ అంశాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. వచ్చే విధ్యా సంవత్సరం నుంచి అంధ, బధిర విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రంలోని దివ్యాంగ సంక్షేమ హస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించనుననట్లు తెలిపారు. పెన్షన్ల పెంపు కూడా అతి త్వరలోనే ఉంటుందని హామీ ఇచ్చారు. ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే.. కల్యాణలక్ష్మితో పాటు అదనంగా మరో రూ.లక్ష ప్రోత్సాహకం అందిస్తున్నట్లు వివరించారు. దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా త్వరలోనే 8వేల మందికి ఉచితంగా పరికరాలు అందిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం 10తరగతి వరకే ఉన్న బ్రెయిలీ లిపి పుస్తకాలను రానున్న రోజుల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయికి విస్తరిస్తామని చెప్పారు. తద్వారా అంధ విద్యార్థులు చదువు మధ్యలో మానేయాల్సిన అవసరం ఉండదని అన్నారు.