Share News

40 ఏళ్లు దాటితే ఏటా ఉచిత ఆరోగ్య పరీక్షలు

ABN , Publish Date - Jul 21 , 2026 | 04:47 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రూపొందించిన నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం (ఎన్‌ఈహెచ్‌ఎస్‌) మార్గదర్శకాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.

40 ఏళ్లు దాటితే  ఏటా ఉచిత ఆరోగ్య పరీక్షలు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా నిర్వహణ

ఓపీ సేవలపై 50 శాతం రాయితీ.. రూ.5 లక్షల వరకు నాన్‌- ప్యాకేజీ చికిత్స

943 ఎంపానెల్‌ ఆస్పత్రులు.. విజయవాడ, కర్నూలులోనూ సేవలు

కుమారులకు 25 ఏళ్ల వరకు, కూతుళ్లయితే వివాహం అయ్యేవరకు వర్తింపు

సీజీహెచ్‌ఎస్ నమూనాలో నగదు రహిత చికిత్సలు

కొత్త ఉద్యోగ ఆరోగ్య పథకం మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, జూలై 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రూపొందించిన నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం (ఎన్‌ఈహెచ్‌ఎస్‌) మార్గదర్శకాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) తరహాలో ఎన్‌ఈహెచ్‌ఎస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త పథకం కింద 40 ఏళ్ల వయసు దాటిన ఉద్యోగులకు ఏటా ఉచితంగా సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. పాత పథకం ఈహెచ్‌ఎస్ ఎంపానెల్‌లో 435 ఆస్పత్రులు మాత్రమే ఉండగా, కొత్త పథకంలో 943 ఆస్పత్రులను చేర్చారు. పాత పథకంలో నాన్‌ ప్యాకేజీ వైద్య సేవల పరిమితి రూ.2 లక్షల వరకే ఉండగా, తాజాగా పథకంలో రూ.5 లక్షలకు పెంచారు.


ఇవీ మార్గదర్శకాలు..

  • ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఈ పథకం కిందికి వస్తారు. మోడల్‌ స్కూళ్లు, గురుకుల, రెసిడెన్షియల్‌, ఎయిడెడ్‌ విద్యాసంస్థలు, మార్కెట్‌ కమిటీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ గ్రంథాలయాల ఉద్యోగులను కూడా ఈ పథకం పరిధిలోకి తెచ్చారు. భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థలను కూడా చేర్చుతారు. ఉద్యోగి భార్య లేదా భర్త, వారిపై ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు, దత్తత పిల్లలు ఈ పథకానికి అర్హులు. నిరుద్యోగ కుమార్తె వివాహం అయ్యే వరకు.. అలాగే వితంతువు, విడాకులు పొందిన లేదా భర్త నుంచి విడిపోయిన కుమార్తె కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. నిరుద్యోగ కుమారుడికి 25 ఏళ్లు వచ్చేవరకు ఈ పథకం కింద వైద్యం పొందే అవకాశం ఉంది. శాశ్వత వికలాంగ పిల్లలకు వయోపరిమితి వర్తించదు.

  • క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత ఎలక్ర్టానిక్‌ హెల్త్‌ కార్డులను జారీచేస్తారు. ఉద్యోగులు మొబైల్‌ యాప్‌ లేదా వెబ్‌ పోర్టల్‌ ద్వారా కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎన్‌ఈహెచ్‌ఎస్‌తో పాటు ఇతర ప్రభుత్వ డేటాబేసేలతో అనుసంధానం చేసి ఉద్యోగుల వివరాలను ధ్రువీకరిస్తారు.

  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతున్న విధంగానే ఇందులో చికిత్స ప్యాకేజీలు, ధరలు, వైద్య ప్రమాణాలు ఉంటాయి. ప్యాకేజీలో పేర్కొన్న చికిత్సలకు ఆస్పత్రులు అదనపు చార్జీలు వసూలు చేయడానికి వీలు లేదు.

  • ఇప్పటివరకు రూ.2 లక్షల వరకు మాత్రమే ఉన్న వైద్య సేవల ఖర్చు పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. అంతకు మించితే హెల్త్‌కేర్‌ ట్రస్టు బోర్డు అనుమతితో నగదు రహిత సేవలు కొనసాగుతాయి.

  • ప్రస్తుత ఈహెచ్‌ఎస్ లో అవుట్‌ పేషెంట్‌ (ఓపీ) సేవలు అందుబాటులో లేవు. కొత్త పథకంలో ఎంపానెల్‌ ఆస్పత్రుల్లో ఓపీడీ కన్సల్టేషన్‌, ల్యాబ్‌ పరీక్షలపై 50 శాతం రాయితీ కల్పిస్తున్నారు. వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా సాధారణ వైద్య ేసవలు, దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ, మందుల పంపిణీ, ల్యాబ్‌ పరీక్షలు, ఆయుర్వేదం, యోగా వంటి భారతీయ వైద్య విధానాలకు కూడా అవకాశం కల్పించారు.


  • 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఉద్యోగికి సంవత్సరంలో ఒకసారి పూర్తిస్థాయి మాస్టర్‌ హెల్త్‌ చెక్‌పను ఉచితంగా నిర్వహిస్తారు.

  • ప్రస్తుతం ఈహెచ్‌ఎస్ కింద ఉన్న 435 ఆస్పత్రులు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పథకంలోని 508 ఆస్పత్రులను కలిపి మొత్తం 943 ఆస్పత్రులతో కూడిన నెట్‌వర్క్‌ ఏర్పాటు చేశారు. విజయవాడ, కర్నూలు వంటి ప్రాంతాల్లో కూడా కొత్త ఆస్పత్రులను ఎంపానెల్‌ చేయనున్నారు.

  • ఈ పథకానికి ఉద్యోగి, పెన్షనర్‌ తనమూల వేతనంలో 1.5 శాతం చందాగా చెల్లించాలి. అంతేమొత్తాన్ని ప్రభుత్వం కూడా ట్రస్టుకు జమ చేస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు అయితే ఒకరి ఖాతా నుంచే చందా చెల్లిస్తే సరిపోతుంది.

  • నెలకు రూ.1,000 వరకు చందా చెల్లించే వారికి ఆస్పత్రిలో సెమీ ప్రైవేట్‌ గది, అంతకంటే ఎక్కువ చెల్లించే వారికి ప్రైవేట్‌ గది సౌకర్యం ఉంటుంది.

  • కొత్త పథకం నిర్వహణ కోసం ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్టు (ఈహెచ్‌సీటీ)ను ఏర్పాటు చేశారు. ఉద్యోగుల చందా, ప్రభుత్వ సమాన వాటా, ఇతర నిధులన్నీ నేరుగా ట్రస్టు ఖాతాలోనే జమ అవుతాయి. ట్రస్టు లెక్కలను కాగ్‌ లేదా ప్రభుత్వం నియమించిన ఆడిట్‌ సంస్థ పరిశీలిస్తుంది.

  • లబ్ధిదారుల నమోదు నుంచి ఆస్పత్రిలో చేరిక, క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌, చెల్లింపులు, ఫిర్యాదుల పరిష్కారం వరకు మొత్తం ప్రక్రియను డిజిటల్‌గా నిర్వహిస్తారు.

  • నకిలీ క్లెయిమ్‌లు, అనవసర చికిత్సలు, అధిక బిల్లింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక సాంకేతిక, ఫార్మా కమిటీలను ఏర్పాటు చేస్తారు.


  • ఆస్పత్రి స్థాయి నుంచి ఈహెచ్‌సీటీ బోర్డు వరకు నాలుగు దశల్లో ఫిర్యాదులను పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి ఫిర్యాదుకు ట్రాకింగ్‌ నంబర్‌ ఉంటుంది. అత్యవసర చికిత్సలు, ఎంపానెల్‌ కాని ఆస్పత్రుల్లో చేరిక వంటి అంశాలకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఉంటుంది.

  • ప్రస్తుత ఈహెచ్‌ఎస్, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పథకాల కింద పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడతల వారీగా చెల్లిస్తారు. అయితే, పాత బకాయిల పరిష్కారం పేరుతో కొత్త పథకం అమలును ఆలస్యం చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

  • కొత్త పథకం అమలులో ఈహెచ్‌సీటీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ, ట్రెజరీ శాఖ, జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖ ల అధిపతులు, డీడీవోలు, పీపీవోలు, ఎంపానెల్‌ ఆస్పత్రులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది.

Updated Date - Jul 21 , 2026 | 04:47 AM