Share News

ఉస్మానియాలో ఉచితంగా 3డీ కృత్రిమ కాళ్ల పంపిణీ

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:24 AM

కాళ్లు కోల్పోయిన పేద బాధితుల కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఉచిత కృత్రిమ అవయవాల (ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌) పంపిణీ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది.

ఉస్మానియాలో ఉచితంగా 3డీ కృత్రిమ కాళ్ల పంపిణీ

హైదరాబాద్‌ సిటీ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): కాళ్లు కోల్పోయిన పేద బాధితుల కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఉచిత కృత్రిమ అవయవాల (ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌) పంపిణీ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ప్రమాదాలు లేదా మధుమేహం వంటి అనారోగ్య కారణాల వల్ల కాళ్లు కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు ఆస్పత్రిలోని ఫుట్‌ కేర్‌ సెంటర్‌ ఈ ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తెచ్చింది. మొదటి రోజే 10 మంది బాధితులకు అత్యాధునిక కృత్రిమ కాళ్లను ఉచితంగా అందజేశారు. ఈ కృత్రిమ అవయవాలను 3డీ ప్రింటింగ్‌ సాంకేతికతతో, తేలికపాటి పదార్థాలతో రూపొందించారు. ప్రతి రోగి శరీర కొలతలకు అనుగుణంగా వీటిని ప్రత్యేకంగా తయారు చేయడం వల్ల, వారు ఎటువంటి శ్రమ, ఒత్తిడి లేకుండా సులభంగా నడవడానికి వీలవుతుందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాకేష్‌ సహాయ్‌ తెలిపారు. ఒక్కో కృత్రిమ అవయవం తయారీకి సుమారు రూ.25 వేల వరకు ఖర్చవుతున్నప్పటికీ, ‘రోగి సహాయత ట్రస్ట్‌’ సహకారంతో ఆర్థికంగా వెనుకబడిన వారికి వీటిని పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఇకపై ప్రతి నెలా ఒక రోజు ఈ కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని వివరించారు.

Updated Date - Mar 17 , 2026 | 04:24 AM