నాలుగు రోజులకే కూలిన ఆనకట్ట
ABN , Publish Date - Feb 15 , 2026 | 07:18 AM
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని అప్పారావుపేటలో నిర్మించిన నాలుగు రోజులకే ఆనకట్ట కూలింది.
అప్పారావుపేట రైతుల్లో ఆందోళన
కొడిమ్యాల, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని అప్పారావుపేటలో నిర్మించిన నాలుగు రోజులకే ఆనకట్ట కూలింది. గ్రామ శివారులోని తుమ్మల మాటు వాగుపై సుమారు 30 మీటర్ల పొడువు, మూడు మీటర్ల ఎత్తుతో ఈ గోడను నిర్మించారు. కేవలం పదిహేను రోజుల క్రితమే పనులు ప్రారంభించి హడావుడిగా పూర్తిచేయడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే అది కూలిపోయిందని స్థానిక రైతులు ఆరోపించారు. ఈ వాగులో నీరు నిలిస్తే అప్పారావుపేటతో పాటు నాచుపల్లి, పూడూర్ గ్రామాల్లోని సుమారు 400 ఎకరాలకు సాగు నీరందుతుందని రైతులు తెలిపారు. ఈ ఘటనపై నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ రాజేష్ ఖన్నాను వివరణ కోరగా, గోడను నాణ్యతా ప్రమాణాలతోనే నిర్మించామని చెప్పారు. అయితే, క్యూరింగ్ కాకముందే నీటి ప్రవాహం రావడంతో అది కూలిపోయిందని, త్వరలోనే తిరిగి ఆనకట్టను నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు.