Share News

తెలంగాణ దాటితే స్థానికత వర్తించనట్టే

ABN , Publish Date - Sep 29 , 2026 | 03:37 AM

తెలంగాణలో వైద్య విద్యలో ప్రవేశానికి ‘నాలుగేళ్ల స్థానికత’ తప్పనిసరి అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది

తెలంగాణ దాటితే  స్థానికత వర్తించనట్టే
SUPREMECOURT

  • వైద్య విద్యకు ‘నాలుగేళ్ల స్థానికత’ తప్పనిసరి

  • 9 నుంచి 12వ తరగతి వరకూ

రాష్ట్రంలో చదవాల్సిందే

  • రాష్ట్ర ప్రభుత్వ జీవోని సమర్థించిన సుప్రీం

  • ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ చదివిన

తెలంగాణ విద్యార్థినికి నిరాశ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వైద్య విద్యలో ప్రవేశానికి ‘నాలుగేళ్ల స్థానికత’ తప్పనిసరి అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు 2017లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ అడ్మిషన్‌ నిబంధనలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. తెలంగాణలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో స్థానిక అభ్యర్థి కోటా కింద అర్హత పొందాలంటే రాష్ట్రంలో 9 నుంచి 12వ తరగతి వరకూ వరుసగా నాలుగేళ్లు చదివి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో 33ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నీట్‌కు ముందు నాలుగేండ్లు స్థానికంగా చదవాల్సిందేనని ఆ జీవోలోని నిబంధన 3(ఏ)లో స్పష్టంగా పేర్కొంది. అయితే.. ఏపీలో ఇంటర్మీడియట్‌ చదివిన తనకు తెలంగాణలో స్థానికత కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ జెల్లా అంకిత అనే విద్యార్థిని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ సర్కారుతోపాటు కాలోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్ సైన్సెస్ ను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగాచేర్చారు.


ఆ పిటిషన్‌ సోమవారం జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నరసింహ నేతృత్వంలోని జస్టిస్‌ అలోక్‌ ఆరాధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వరుణ్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. అంకిత తెలంగాణలోనే జన్మించిందని, ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ రాష్ట్రంలోనే పూర్తిచేసిందని ధర్మాసనానికి తెలిపారు. మెరుగైన విద్య కోసమే ఇంటర్మీడియట్‌ను ఏపీలో పూర్తి చేసిందని చెప్పారు. దీనివల్ల వైద్య విద్య అడ్మిషన్‌ సమయంలో స్థానికత సమస్య తలెత్తిందని తెలిపారు. విద్యార్థిని తండ్రి, తాత అందరూ తెలంగాణలోనే నివసిస్తున్నారని.. అంకితకు స్థానికతను నిరాకరించడం సరికాదని వాదించారు. ఆమెకు ఇప్పుడు అటు ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన ఆంధ్రప్రదేశ్‌లో, 10వ తరగతి వరకూ చదివిన తెలంగాణలో.. ఎక్కడా స్థానికత వర్తించడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థిని తీవ్రంగా నష్టపోతోందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని చాలా భిన్నమైన, ప్రత్యేకమైన కేసుగా పరిగణించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న ధర్మాసనం.. తండ్రి, తాత ఎక్కడ ఉంటున్నారనేది స్థానికత అంశంలో అప్రస్తుతతమని తెలిపింది. చదువు కోసం తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లారా? లేదా? అనేదే ఇక్కడ ముఖ్యమని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. రాష్ట్రపతి ఉత్తర్వులను కాదని, ఎటువంటి ప్రత్యేక వెసులుబాటూ కల్పించలేమని తేల్చిచెప్పింది. అలా చేస్తే.. అది రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది. ‘‘హైకోర్టు ఇచ్చిన తీర్పును, ఉత్తర్వులను మేము సమర్థిస్తున్నాము, వాటిలో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం కనిపించట్లేదు. ఈ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నాం. ఈ కేసుకు సంబంధించి ఇతర అనుబంధ పిటిషన్లు ఏవైనా ఉంటే, వాటిపై సైతం విచారణను ముగించినట్లే భావించాలి’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఈ వార్తలు కూడా చదవండి

రోడ్డు తనిఖీలో చెంపదెబ్బ వివాదం! ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మపై కేసు నమోదు

ఎల్‌పీయూలో భయానక రాత్రి.. ఆ రోజు ఏం జరిగింది..?

Updated Date - Sep 29 , 2026 | 03:39 AM