Share News

తొలుత మూసీని పునరుద్ధరించండి

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:56 AM

మూసీ నదిని పునరుద్ధరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తున్నామని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ పేర్కొంది. పూర్తిగా మూసీ నది శుద్ధికి ముందే ఆలయాలు...

తొలుత మూసీని పునరుద్ధరించండి

  • ముందే పూజా స్థలాల నిర్మాణం సముచితం కాదు

  • సీఎం రేవంత్‌ రెడ్డికి ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ లేఖ

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): మూసీ నదిని పునరుద్ధరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తున్నామని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ పేర్కొంది. పూర్తిగా మూసీ నది శుద్ధికి ముందే ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిల వంటి పూజా స్థలాల నిర్మాణం ప్రారంభించడం సముచితం కాదని సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసింది. 2017లో నాటి ప్రభుత్వం ఎంఆర్‌డీసీఎల్‌ ఏర్పాటు చేసి మూసీ కాలుష్య నిర్మూలన, పునరుద్ధరణకు సమగ్ర ప్రణాళిక రూపొందించినా.. మూసీ నది శుద్ధీకరణలో పురోగతి సాధించలేదని గుర్తు చేసింది. నగరంలో ప్రవహించే మూసీ నది పలుచోట్ల వచ్చినఆక్రమణలతో పెద్ద నాలాగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. మురుగు నీటి శుద్ధి వ్యవస్థలు లేక.. శుద్ధి చేయని మురుగు నీరు నదిలోకి చేరడంతో తీవ్రమైన కాలుష్యాన్ని కలిగిస్తుందని వివరించింది. మూసీ నదిని అత్యంత ప్రాధాన్య గ్రస్త ప్రాంతంగా ఎన్‌జీటీ, దేశంలోనే అత్యంత కాలుష్యగ్రస్త నదుల్లో ఒకటిగా కాలుష్య నియంత్రణ మండలి గుర్తించాయని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అధ్యక్షులు ఎం.పద్మనాభరెడ్డి తెలిపారు. జలచర జీవులు, వ్యవసాయం, మానవ వినియోగానికి అనుకూలంగా లేనందున మూసీ నదిని శుద్ధి చేయడం అత్యంత కీలకమన్నారు. నదిని పూర్తిగా శుద్ధి చేయకముందే పూజా స్థలాల నిర్మాణం చేపట్టడం సముచితం కాదని, కాలుష్యంతో నిండిన నది మధ్యలో శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తగదని తెలిపారు. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని మూసీ నది శుద్ధీకరణను ప్రథమ ప్రాధాన్యంగా చేపట్టాలని సూచించారు.

Updated Date - Apr 04 , 2026 | 04:56 AM