జన సేనలో చేరిన మాజీ డీహెచ్ గడల
ABN , Publish Date - Jun 04 , 2026 | 06:10 AM
రాష్ట్ర ప్రజారోగ్య మాజీ సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జనసేన పార్టీ అధ్యక్షుడు....
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్
ఆయన చేరిక తెలంగాణలో పార్టీకి మరింత బలాన్నిస్తుంది: పవన్ కల్యాణ్
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజారోగ్య మాజీ సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసంలో ఆయన జనసేనలో చేరారు. గడలకు పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించిన పవన్.. డాక్టర్ గడల కుటుంబంతో తమ కుటుంబానికి ఎంతోకాలంగా అనుబంధం ఉందన్నారు. అంకితభావం, నిజాయతీ కలిగిన అధికారిగా డాక్టర్ గడల ప్రజల్లో పేరు సంపాదించుకున్నారని చెప్పారు. ప్రభుత్వ వైద్యుడిగా ప్రారంభమైన ప్రస్థానం ప్రజారోగ్య శాఖ సంచాలకుడి స్థాయికి చేరుకోవడం ఆయన కృషి, నిబద్ధతకు నిదర్శనమని పవన్ తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి సమయంలో గడల అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. డాక్టర్ గడల వంటి అనుభవజ్ఞులు, సే వాభావం కలిగిన వ్యక్తులు జనసేనలో చేరడం పార్టీకి మరింత బలాన్ని, విశ్వసనీయతను తీసుకొస్తుందని తెలిపారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. డాక్టర్ గడల మాట్లాడు తూ.. పవన్‌తో తన అనుబంధం చిరంజీవి ద్వారా ప్రారంభమైందన్నారు. కాలక్రమేణా పవన్ వ్యక్తిత్వం, నిజాయతీ, ప్రజా సమస్యల పట్ల నిబద్ధత తనను ప్రభావితం చేశాయని చెప్పారు. తాను జనసేనలో చేరడం భావోద్వేగపూరిత నిర్ణయంకాదని, సమాజానికి మరిం త సేవ చేయాలన్న సంకల్పంతో తీసుకున్న నిర్ణయమన్నారు. ప్రస్తుత తరానికి విలువలతో కూడిన రాజకీయాలు అవసరమని, ఆ లక్ష్యంతో పనిచేస్తున్న జనసే న తనకు సరైన వేదికగా భావించానని తెలిపారు. ఇక పై జనసైనికుడిగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసు కెళ్లడమే కాకుండా, తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషిచేస్తానన్నారు. ప్రజల ఆశీస్సులు, సహకారం తన కు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు.