Share News

ధాన్యం లెక్కల్లో అవకతవకలు..మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌పై కేసు

ABN , Publish Date - Aug 20 , 2026 | 05:37 AM

ప్రభుత్వానికి చెందిన ధాన్యం లెక్కల్లో అవకతవకలు ఉండడంతో మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌పై కేసు నమోదైంది. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం సత్తెనపల్లిలో..

ధాన్యం లెక్కల్లో అవకతవకలు..మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌పై కేసు

  • ఏఆర్‌ఎస్‌ ఇండస్ట్రీస్‌, రైస్‌ మిల్లులో తనిఖీలు

  • రూ.40.96 కోట్ల విలువైన 9,639 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు గుర్తింపు

  • పౌరసరఫరాల అధికారుల ఫిర్యాదుతో కేసు

ఖానాపూర్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి చెందిన ధాన్యం లెక్కల్లో అవకతవకలు ఉండడంతో మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌పై కేసు నమోదైంది. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం సత్తెనపల్లిలో రేఖానాయక్‌కు చెందిన ఏఆర్‌ఎస్‌ ఇండస్ట్రీస్‌, ఏఆర్‌ఎస్‌ రైస్‌ మిల్లులో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఈ నెల 18న తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా 2022-23, 2023-24, 2024-25 రబీ సీజన్లకు సంబంధించిన ప్రభుత్వ ధాన్యంలో 9,639.96 మెట్రిక్‌ టన్నుల కొరత ఉన్నట్లు గుర్తించారు. కనీస మద్దతు ధర ప్రకారం ఈ ధాన్యం విలువ సుమారు 40.96 కోట్లుగా నిర్ధారించారు. ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కూడా భారీగా బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ సుధాకర్‌ ఫిర్యాదుతో ఏఆర్‌ఎస్‌ ఇండస్ట్రీస్‌, ఏఆర్‌ఎస్‌ రైస్‌ మిల్లుల యజమాని రేఖానాయక్‌పై బుధవారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీ సోషల్‌ మీడియాలో వైరలైంది. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఖానాపూర్‌ పోలీసులను వివరణ కోరగా పౌరసరఫరాల అధికారులను సంప్రదించాలని సూచించారు. డీఎం సుధాకర్‌ను సంప్రదించగా కేసు నమోదైనట్లు ధ్రువీకరించారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీలో నమోదైన వివరాలన్నీ సరైనవేనని తెలిపారు. ఈ విషయంలో పై అధికారులను సంప్రదించాలని చెప్పారు. సామాన్యులపై కేసు నమోదైతే వివరాలను వెల్లడించేందుకు ప్రెస్‌ మీట్‌లు పెట్టే అధికారులు.. రాజకీయ నేతలపై కేసుల విషయంలో మాత్రం వివరాలను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించడం పలు విమర్శలకు దారితీస్తోంది.

Updated Date - Aug 20 , 2026 | 05:38 AM