25న కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి రాజీనామా!
ABN , Publish Date - Mar 22 , 2026 | 05:00 AM
కాంగ్రెస్ కు మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి రాజీనామా చేసేందుకు ముహూర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 25న అనుచరులతో కలిసి ఆయన రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
ఆ కార్యక్రమం కోసం జగిత్యాలలో ఫంక్షన్ హాల్ బుకింగ్
మాజీ మంత్రితో మంత్రులు దుద్దిళ్ల, అడ్లూరి జరిపిన చర్చలు విఫలం
ఎవరొచ్చి మాట్లాడినా తగ్గేదేలే: జీవన్‌రెడ్డి
జగిత్యాల, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ కు మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి రాజీనామా చేసేందుకు ముహూర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 25న అనుచరులతో కలిసి ఆయన రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ అంశంపై జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పలు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో ఆయన చర్చించినట్లు తెలిసింది. జీవన్‌రెడ్డితోపాటు ఆయన అనుచరవర్గం మొత్తం మూకుమ్మడి రాజీనామాలు చేయనున్నట్లు తెలుస్తోంది. అనుచరులు, కార్యకర్తలతో మరోమారు చర్చించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. రాజీనామా కార్యక్రమం నిర్వహించడానికి ఇప్పటికే జగిత్యాలలో ఓ ఫంక్షన్ హాల్‌ను బుక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
జీవన్‌రెడ్డితో మంత్రుల చర్చలు
పార్టీలో తనకు సరైన గౌరవం దక్కటం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రయత్నించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి శనివారం వారు జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. అయితే, అవమానాలు ఎదుర్కొంటూ పార్టీలో కొనసాగలేనని జీవన్‌రెడ్డి స్పష్టంచేసినట్లు సమాచారం. తనతో మాట్లాడేందుకు వచ్చినందుకు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. చివరకు ‘సారీ శ్రీధర్, లక్ష్మణ్’ అని సమావేశాన్ని ముగించినట్లు తెలిసింది. ఈ భేటీ అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. జీవన్‌రెడ్డి అభిప్రాయాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పార్టీలో జీవన్‌రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి తదితరులు జీవన్‌రెడ్డితో ఇప్పటికే మాట్లాడినట్లు వెల్లడించారు. అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌కు చెందిన పదిమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారని వారు తెలిపారు.
ఆలోచనను మార్చుకునేదే లేదు..
తనతో ఎవరు మాట్లాడినా పార్టీకి రాజీనామా చేయాలన్న ఆలోచనను మార్చుకునే అవకాశమే లేదని జీవన్‌రెడ్డి స్పష్టంచేశారు. మంత్రులు కలిసి వెళ్లిన తర్వాత ఆయన తన అనుచరులు, కార్యకర్తలతో ఈ అంశంపై ముచ్చటించారు. ఎవరొచ్చి మాట్లాడినా తగ్గేది లేదని తేల్చిచెప్పారు. రాజకీయ పరిణామాలపై నేడు (ఆదివారం) పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. దేవుడు శాసించాడు, మానవుడు అనుసరిస్తాడంటూ కార్యకర్తల కేరింతల మధ్య స్పష్టం చేశారు.