Share News

అవమానాలు భరించలేక కాంగ్రెస్‌కు రాజీనామా

ABN , Publish Date - Mar 26 , 2026 | 04:47 AM

కాంగ్రెస్‌లో అవమానాలు భరించలేక పార్టీకి రాజీనామా చేశా. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణలో కాంగ్రెస్‌ నడుస్తోంది.

అవమానాలు భరించలేక కాంగ్రెస్‌కు రాజీనామా

  • రాహుల్‌గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణలో కాంగ్రెస్‌ నడుస్తోంది

  • గతంలో చంద్రబాబు, కేసీఆర్‌లపై పోరాటం చేశా

  • ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డిపై పోరాటం చేస్తా

  • మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి

జగిత్యాల/న్యూఢిల్లీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్‌లో అవమానాలు భరించలేక పార్టీకి రాజీనామా చేశా. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణలో కాంగ్రెస్‌ నడుస్తోంది. గతంలో చంద్రబాబు, కేసీఆర్‌లపై పోరాటం చేశా. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డిపై పోరాటం చేస్తా. మండలిలో బీఆర్‌ఎస్‌‌ను ఒంటరిగా ఎదుర్కొన్నా. మంత్రి పదవికి అనర్హుడినా..? గతంలో టీపీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్నా. ఇప్పుడు నియోజకవర్గంలో హక్కుల కోసం అడుక్కోవాల్సి వస్తోంది’’ అని మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో అనుచరులు, సన్నిహితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్న సంతోషం కూడా లేకుండా చేశారన్నారు. 20 నెలలుగా పార్టీలో మానసిక వేదనకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేకు రాజీనామా లేఖను పంపుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌ కార్యకర్తల శ్రమతోనే రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందన్నారు. తాను రేవంత్‌ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తే వాడిని కాదని చెప్పారు. బతుకు దెరువు కోసం వచ్చిన పోచారం శ్రీనివాస్‌‌రెడ్డికి సలహాదారు పదవి ఇస్తారా అని ప్రశ్నించారు. అసలు ఎవరీ వేం నరేందర్‌ రెడ్డి..? సీనియర్‌ నేత చిన్నారెడ్డిని ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకెళ్లారన్నారు. నిజానికి తాను టీపీసీసీ చీఫ్‌ కావాల్సింది.. కానీ రేవంత్‌రెడ్డి కుటిల రాజకీయాలు చేసి సోనియా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చక్రం తిప్పారని ఆరోపించారు. తన అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురైనప్పుడు రేవంత్‌రెడ్డి కనీసం ఫోన్‌ చేసి పరామర్శించలేదని ఆవేదన చెందారు. తాను కాంగ్రెస్‌లో ఉండవద్దని రేవంత్‌రెడ్డి ఇదంతా చేస్తున్నారన్నారు. దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి, ఆ తర్వాత ఎంపీగా పోటీ చేయిస్తే సరిపోయేదని, అలా కాకుండా పార్టీ ప్రతిష్టను దిగజార్చారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ తనదని, అడ్డొస్తే తొక్కుతా అనే రీతిలో రేవంత్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇకనైనా కాంగ్రెస్‌ కార్యకర్తల హక్కులను రక్షిస్తారని అనుకుంటున్నానని ఆయన అన్నారు. జీవన్‌రెడ్డికి మద్దతుగా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.


జీవన్‌ రెడ్డి మనసు మార్చుకోవాలి: మల్లు రవి

జీవన్‌ రెడ్డి మనసు మార్చుకోవాలని, పార్టీలోనే కొనసాగాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌, ఎంపీ మల్లు రవి కోరారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా సుధీర్ఘ అనుభవం ఉన్న జీవన్‌ రెడ్డి ప్రజాపాలనకు సహకరిస్తూ ప్రభుత్వానికి అండగా ఉంటే బాగుంటుందని బుధవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. జీవన్‌ రెడ్డి పార్టీని వీడడం అత్యంత బాధాకరమని తెలిపారు.

రాజీనామాపై గల్ఫ్‌లోనూ ఆసక్తి

  • (ఆంధ్రజ్యోతి గల్ప్‌ప్రతినిధి)

కాంగ్రెస్‌కు జీవన్‌ రెడ్డి రాజీనామాపై గల్ఫ్‌ దేశాల్లోని తెలంగాణ ప్రవాసీల్లో చర్చ మొదలైంది. జీవన్‌రెడ్డి భావోద్వేగ ప్రసంగాన్ని వారంతా వీక్షించారు. తన ప్రసంగంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఒక ప్రముఖుడి గురించి ప్రస్తావించడంతో దుబాయి నుంచి మొదలు దమ్మాం వరకు అనేక మంది ఈ అంశాన్ని ప్రముఖంగా చర్చించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన అనేక మంది ప్రవాసీలు జీవన్‌ రెడ్డికి ఫోన్‌ చేసి తమ సంఘీభావం తెలిపారు. జగిత్యాల నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసీలు గల్ఫ్‌ దేశాలలో పని చేస్తుండగా, వారందరికీ జీవన్‌ రెడ్డి సుపరిచితుడు కావడంతో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడం పట్ల కొందరు విచారం వ్యక్తం చేయగా, ఈ దశలో ఆయన ఇతర పార్టీల్లోకి వెళ్లడం శ్రేయస్కరం కాదని, ఆయన స్ధాయికి తగినట్లుగా గౌరవ మర్యాదలు లభించవని మరికొందరు అభిప్రాయపడ్డారు.

Updated Date - Mar 26 , 2026 | 04:47 AM