Share News

లొంగిపోవడానికి వస్తే.. లిస్ట్‌లో పేరు లేదు!

ABN , Publish Date - May 20 , 2026 | 03:15 AM

తాను మావోయిస్టునంటూ ఓ వ్యక్తి లొంగిపోవడానికి వస్తే.. తీరా రికార్డులు వెతికిన పోలీసులకు అతడి పేరు ఎక్కడా కనిపించలేదు. చివరకు పూర్తి వివరాల కోసం అతడిని హైదరాబాద్‌కు ...

లొంగిపోవడానికి వస్తే.. లిస్ట్‌లో పేరు లేదు!

  • సూర్యాపేట ఎస్పీ కార్యాలయానికి వచ్చిన మాజీ మావోయిస్టు

  • పూర్తి వివరాల కోసం హైదరాబాద్‌కు తరలింపు

సూర్యాపేట క్రైం, మే 19 (ఆంధ్రజ్యోతి): తాను మావోయిస్టునంటూ ఓ వ్యక్తి లొంగిపోవడానికి వస్తే.. తీరా రికార్డులు వెతికిన పోలీసులకు అతడి పేరు ఎక్కడా కనిపించలేదు. చివరకు పూర్తి వివరాల కోసం అతడిని హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. ఈ ఘటన సూర్యాపేట ఎస్పీ కార్యాలయంలో మంగళవారం చోటు చేసుకుంది. మాజీ మావోయిస్టుగా చెప్పుకుంటున్న జగన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం ఊకల్‌ గ్రామానికి చెందిన పెద్దోజు దేవేంద్రాచారి అలియాస్‌ జగన్‌ 12 ఏళ్ల క్రితం మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఛత్తీస్‌గఢ్‌లోని సుఖ్‌దేవ్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మావోయిస్టు పార్టీలో చేరాడు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సునీతను వివాహం చేసుకోగా, వీరికి నలుగురు పిల్లలున్నారు. నాలుగేళ్ల క్రితం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో జగన్‌ కాలికి బుల్లెట్‌ తగిలింది. దీంతో ఉద్యమాన్ని వదిలేసి, సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ (ఎస్‌) మండలంలోని పాతర్లపాడులో ఉన్న తన సోదరి ఇంటికి కుటుంబంతో సహా వచ్చేశాడు. అక్కడ కార్పెంటర్‌ పని చేసుకుంటూ రహస్యంగా జీవిస్తున్నాడు. ఇటీవల పోలీసులు తన కోసం గాలిస్తున్నారని, దొరికిపోతాననే భయంతో జగన్‌ మంగళవారం నేరుగా సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయానికి లొంగిపోవడానికి వచ్చాడు.

Updated Date - May 20 , 2026 | 03:15 AM