కలల కక్ష్యలోకి..
ABN , Publish Date - Jul 19 , 2026 | 05:58 AM
ఒక కల... ఇద్దరు యువకులు... లెక్కలేనన్ని కష్టాలు.. అంతులేని శ్రమ... చివరికి ప్రపంచం తలెత్తి చూసే విజయం. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేటు సంస్థ ‘స్కైరూట్ ఏరో స్పేస్’ ప్రయాణమిది.
ఇస్రోను వీడి సొంత ప్రయాణం
ఆటుపోట్లు ఎదురైనా.. కరోనా అడ్డుపడినా ఆగకుండా ప్రయత్నం
స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు పవన్‌కుమార్, నాగ భరత్ విజయగాథ
హైదరాబాద్, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఒక కల... ఇద్దరు యువకులు... లెక్కలేనన్ని కష్టాలు.. అంతులేని శ్రమ... చివరికి ప్రపంచం తలెత్తి చూసే విజయం. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేటు సంస్థ ‘స్కైరూట్ ఏరో స్పేస్’ ప్రయాణమిది. నాగ భరత్ రెడ్డి డాక, పవన్ కుమార్ చందన అనే ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు అంతరిక్ష రంగంలో దేశాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఓ యజ్ఞమే చేశారు. తమ పట్టుదల, శ్రమకు తోడు గోరంత అదృష్టంతో చేరుకున్నారు. స్టార్ట్‌పగా మొదలైన స్కైరూట్‌ను ఆకాశమే హద్దు అన్నట్టు మిలియన్ డాలర్ల కంపెనీగా మార్చారు. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటీల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన నాగభరత్, పవన్ కుమార్ అత్యున్నత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఉద్యోగం దక్కిందని విశ్రమించలేదు. ఇస్రోలో పని చేస్తున్న సమయంలో స్నేహితులైన వారిద్దరి జీవితాన్ని.. ‘‘ప్రభుత్వ సంస్థ మాత్రమే కాదు... ప్రైవేట్ సంస్థ కూడా అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించగలదు. మనం ఎందుకు ప్రయత్నించకూడదు?’’ అనే ఒక్క ఆలోచన మార్చేసింది. ఇస్రోలో సురక్షితమైన ఉద్యోగాన్ని వదిలేసుకున్న వారిద్దరూ.. తమ కలను సాకారం చేసుకునేందుకు 2018లో స్కైరూట్ ఏరోేస్ప్‌సకు శ్రీకారం చుట్టారు. స్కైరూట్ అంతరిక్ష పరిశోధన సంస్థ కావడంతో ఒక్క అడుగు వేయాలన్నా వందల కోట్లు కావాలి. దీంతో పెట్టుబడుల కోసం ఎన్నో తలుపులు తట్టారు.
ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నారు. చివరకు బెంగళూరుకు చెందిన ఓ సంస్థ రూ.10కోట్ల పెట్టుబడితో చేయూతనిచ్చింది. ఇక తమ ప్రయాణం వేగం పుంజుకుంటుందని భావించిన సమయంలోనే కరోనా మహమ్మారి రూపంలో భారీ దెబ్బ తగిలింది. ప్రపంచం మొత్తం ఆగిపోయినట్లే వారి కల కూడా నిలిచిపోయింది. మూడు సంవత్సరాలు తీవ్ర అనిశ్చితి.. ఆర్థిక ఇబ్బందులు.. భవిష్యత్తుపై సందిగ్ధం.. అయినా భరత్ రెడ్డి, పవన్ కుమార్ ఆశను వదులుకోలేదు. వారి పట్టుదలను గుర్తించిన గ్రీన్‌కో అనే కంపెనీ ముందుకొచ్చింది. ఇటీవల దిగ్గజ పెట్టుబడి సంస్థ బ్లాక్‌స్టోన్ కూడా విశ్వాసం వ్యక్తం చేసింది. ఒక్కో పెట్టుబడితో వారి కలకు కొత్త రెక్కలు వచ్చాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా శ్రమించారు. ఎన్నో వైఫల్యాలు చూశారు. ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు. 2022లో చేపట్టిన తొలి ప్రయోగం విజయానికి చేరువై చివరి క్షణాల్లో నిరాశ మిగిల్చింది. మరొకరైతే అక్కడే ఆగిపోయేవారు.. కానీ, భరత్ రెడ్డి, పవన్ కుమార్ మాత్రం వెనకడుగు వేయలేదు. తప్పులు సరిదిద్దుకొని.. ఒక్కో మెట్టు ఎక్కి పట్టుదలతో మళ్లీ లేచారు. ఆ పట్టుదలకు ఫలితమే నేడు ప్రపంచం చూసిన విక్రమ్-1 విజయం. ఒకప్పుడు పెట్టుబడిదారుల కోసం తలుపులు తట్టిన ఆ యువకులకు నేడు ప్రపంచమే జేజేలు పలికించింది.
ఐఐటీ విద్య, ఇస్రో అనుభవం..
స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నాగభరత్ ఐఐటీ మద్రాసులో 2007--2011 మధ్య ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. అదే సంస్థలో 2011--2012లో మైక్రోఎలక్ర్టానిక్స్ అండ్ వీఎల్‌ఎ్‌సఐ డిజైన్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేశారు. విద్యార్థి దశలోనే 2010లో టాటా ఎలెక్సీ సంస్థలో ఇంటర్న్‌షిప్ చేశారు. తర్వాత 2012 నుంచి 2015 వరకు తిరువనంతపురంలోని ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో అవియానిక్స్ ఇంజనీర్‌గా పని చేశారు. అనంతరం జైలింక్స్ సంస్థలో సీనియర్ ప్రొడక్ట్ అప్లికేషన్ ఇంజనీర్‌గా ేసవలందించిన ఆయన 2018లో స్కైరూట్ ఏరోస్పేస్ కు సహ వ్యవస్థాపకుడిగా మారారు. ఇక, స్కైరూట్ వ్యవస్థాపకుల్లో ఇంకొకరైన పవన్‌కుమార్ చందన 2007-2012 మధ్య ఐఐటీ ఖరగ్‌పూర్‌లో డ్యుయల్ డిగ్రీ కింద మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్, థర్మల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. 2012 నుంచి 2018 వరకు ఇస్రోలో శాస్త్రవేత్తగా పని చేశారు. ఇలా పవన్ కుమార్, నాగ భరత్ ఇస్రోలో తాము సంపాదించిన అనుభవంతో కృషి చేసి.. స్కైరూట్ ఏరోస్పే్‌సకు, అంతరిక్ష రంగంలో భారతదేశానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు.
పదేళ్ల కష్టం..!
భరత్, పవన్‌ల పదేళ్ల కష్టం ఇప్పుడు ఫలించింది. వాళ్ల విజయపథం కొండంత కష్టం.. గోరంత అదృష్టం అన్నట్లుగా సాగింది. ఈ పదేళ్ల కష్టంలో తండ్రిగా నా పాత్ర వారిని నిరుత్సాహపరచకుండా.. ప్రోత్సహించడమే. వారి రోజువారి కార్యకలాపాల్లో జోక్యం చేసుకోలేదు. పట్టుదలతో శ్రమిస్తే సాధించగలరని మాత్రం ప్రోత్సహించాను
- డాక రఘురామ రెడ్డి, నాగ భరత్ తండ్రి
ఆనందంలో మాటలు రావట్లేదు
మాటల్లేవు.. చాలా చాలా సంతోషంగా ఉంది. బయటికి ఎన్నో విషయాలు చెప్పాలని ఉన్నా.. ఈ ఆనందంలో మాటలు రావడంలేదు. వీరి విజయంతో ఇండియా సత్తా ప్రపంచానికి తెలిసింది. వీరి టీంలో అందరూ యువకులే.. సగటుగా లెక్కేస్తే 28 ఏళ్లుంటాయి. కానీ ప్రపంచానికి భారత సాంకేతికత పరిజ్ఞానం అంటే ఏంటో తెలిసొచ్చేలా గొప్ప విజయాన్ని అందుకున్నారు. అవకాశాలిస్తే దేన్నైనా అందుకోగలరని నిరూపించారు. అందరికీ శుభాకాంక్షలు
- చావలి శ్రీరామచంద్రమూర్తి, నాగ భరత్ మామ