Share News

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం వెనుక కేటీఆర్‌ హస్తం

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:44 AM

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం వెనుక కేటీఆర్‌ హస్తం ఉందేమోనన్న అనుమానాన్ని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యక్తం చేశారు...

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం వెనుక కేటీఆర్‌ హస్తం

  • అనుమానం వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ ఎంపీ చామల

  • బీఆర్‌ఎ్‌సపై కిషన్‌రెడ్డి కృతజ్ఞత చాటుకుంటున్నారంటూ ధ్వజం

  • కేటీఆర్‌పై చర్యలకు ఎన్నికల సంఘానికి టీపీసీసీ ఫిర్యాదు

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం వెనుక కేటీఆర్‌ హస్తం ఉందేమోనన్న అనుమానాన్ని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యక్తం చేశారు. అందుకే ముందే వచ్చి సీఎం రేవంత్‌రెడ్డిపై ఆయన అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి టేపులు, వివరాలూ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లోనే ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే ఎస్‌ఐబీ కార్యాలయంలో సీసీ కెమెరాలు బంద్‌ చేసి.. ఇజ్రాయెల్‌ నుంచి తెచ్చిన పరికరాలు, ఫైళ్లను ధ్వసం చేసి.. మూసీ నదిలో పడేయించిన చరిత్ర కేటీఆర్‌కు ఉందని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌ది ఉద్యమ చరిత్ర, సీఎం రేవంత్‌ది ద్రోహ చరిత్రంటూ హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై చామల మండిపడ్డారు. ‘వాస్తవానికి ఉద్యమం పేరు చెప్పి రూ.వేల కోట్లు సంపాదించుకున్న చరిత్ర.. కుటుంబంలో ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్న చరిత్ర కేసీఆర్‌ది. కమీషన్లు దండుకుని మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర వారిది’ అని విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎ్‌సపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిది కృతజ్ఞతా భావమన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్‌ఎస్‌ అవయవదానం చేసిందని, ఇప్పుడు మునిసిపల్‌ ఎన్నికల్లో ఆ కృతజ్ఞతను తీర్చుకోవాలని కిషన్‌రెడ్డి భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వంకర మాటలు వింటుంటే ప్రజలకు విరక్తి కలుగుతోందన్నారు. కరీంనగర్‌లో ఎలాగైనా గెలవాలని ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. ఆ చిల్లర మాటలు మానేస్తే మంచిదని హితవు పలికారు. కారు గుర్తుకు ఓటు వేయకుంటే కళ్లు పోతాయని ఓ పంతులుగారు చెప్పారంటూ కేటీఆర్‌ తాండూర్‌లో ఓటర్లను సెంటిమెంటల్‌గా బ్లాక్‌మెయిల్‌ చేసే ప్రయత్నం చేశారంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదినికి టీపీసీసీ ఎలక్షన్‌ కమిషన్‌ సమన్వయ కమిటీ ఫిర్యాదు చేసింది. అలాగే ఓటుకు డబ్బులు అడగాలని సూచించారని.. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అలాగే వర్ధన్నపేటలో బీఆర్‌ఎస్‌ నేతలు ఓట్ల కోసం పిల్లలతో కాళ్లు మొక్కించారని ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి తెచ్చింది.

Updated Date - Feb 09 , 2026 | 02:44 AM