యువతికి ఇష్టంలేని పెళ్లి.. తల్లిదండ్రులు, భర్త అరెస్ట్
ABN , Publish Date - May 23 , 2026 | 05:12 AM
యువతికి ఇష్టం లేకుండా బలవంతపు పెళ్లి చేశారన్న కారణంతో ఆమె తల్లిదండ్రులను, భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ ఇన్‌చార్జి ఏసీపీ ....
జనగామ, మే 22(ఆంధ్రజ్యోతి): యువతికి ఇష్టం లేకుండా బలవంతపు పెళ్లి చేశారన్న కారణంతో ఆమె తల్లిదండ్రులను, భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ ఇన్‌చార్జి ఏసీపీ భీంశర్మ తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన కక్కెర్ల లహరిని ఆమె తండ్రి రాకేశ్ గౌడ్, సవతి తల్లి రేణుక పెంబర్తికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు ఆవుల ప్రశాంత్‌రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. ప్రశాంత్‌రెడ్డిని పెళ్లి చేసుకోకుంటే పురుగుల మందు తాగి చనిపోతామంటూ బెదిరించడంతో ఆమె పెళ్లికి అంగీకరించారు. ఈ క్రమంలో తనను రూ.20లక్షలకు ప్రశాంత్‌రెడ్డికి అమ్మారంటూ లహరి మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. అంతేకాదు జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆమె తండ్రి రాకేశ్‌గౌడ్, సవతి తల్లి రేణుక, భర్త ఆవుల ప్రశాంత్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. అనంతరం ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.