లులు హైపర్ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు
ABN , Publish Date - May 20 , 2026 | 03:57 AM
రాజధాని హైదరాబాద్‌లోని లులు హైపర్ మార్కెట్‌లో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం తనిఖీలు చేశారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకున్న అధికారులు..
నాణ్యత లేని 150 కిలోల ఆహార పదార్థాల స్వాధీనం
హైదరాబాద్ సిటీ, మే 19 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌లోని లులు హైపర్ మార్కెట్‌లో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం తనిఖీలు చేశారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకున్న అధికారులు.. లులు హైపర్ మార్కెట్‌లోని పలు ఆహార పదార్థాలు అపరిశుభ్రంగా ఉన్నట్టు తనిఖీల్లో గుర్తించారు. నిల్వ ఉంచిన మిగిలిన ఆహార పదార్థాలు, కుళ్లిపోయిన కూరగాయలను కూడా కనుగొన్నారు. గోధుమ పిండి, పప్పు దినుసుల్లో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా గడువు తీరిన, తప్పుగా లేబుల్ చేయబడిన ఆహార ఉత్పత్తులను విక్రయానికి ఉంచినట్లు గుర్తించారు. కొన్ని ప్యాక్ చేసిన వస్తువులపై ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ లైసెన్స్ గడువు ముగిసినట్లు వెల్లడైంది. మాంసం కోసే విభాగంలో డ్రైన్లు మూసుకుపోవడంతో తీవ్ర దుర్వాసన వ్యాపించినట్లు తనిఖీల్లో బయటపడింది. తనిఖీ సందర్భంగా స్వీట్లు, నూనెలు, పిండి పదార్థాలు, పప్పుదినుసులు సహా సుమారు 150కిలోల నాణ్యతలేని ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. కల్తీ, కృత్రిమ రంగులు ఉపయోగించినట్లు అనుమానం ఉన్న ఆహార నమూనాలను ప్రయోగశాలకు పంపారు.