kumaram bheem asifabad- పశుగ్రాసం సాగుపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Oct 28 , 2026 | 10:34 PM
వీవీజీరామ్‌జీ పథకం కింద రైతులు పశువులకు అవసరమైన పశుగ్రాసం సాగు చేసి ఆర్థికంగా లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రత్యేక కార్యదర్శి దాన కిషోర్, సీఈవో దివ్యదేవరాజన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమీక్షించారు
ఆసిఫాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): వీవీజీరామ్‌జీ పథకం కింద రైతులు పశువులకు అవసరమైన పశుగ్రాసం సాగు చేసి ఆర్థికంగా లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రత్యేక కార్యదర్శి దాన కిషోర్, సీఈవో దివ్యదేవరాజన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవక పంటలు దెబ్బతింటున్న నేపథ్యంలో రైతులు గ్రామీణ కూలీలకు వీబీజీరామ్‌జీ పథకం కింద ఉపాధి హామీ పనులు కల్పించాలని సూచించారు. ఈ ప్రాంతాలకు వలస వెళ్లకుండా గ్రామాల్లోనే కొత్త పనులను గుర్తించి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. వీబీజీరామ్‌జీ పథకం కింద అను మతించిన 375 రకాల పనుల గురించి సర్పంచ్‌లకు అవగాహన కల్పించి పని దినాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సభలు నిర్వహించి అవసరమైన పనులను గుర్తించి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చెప్పారు. పశువుల తాగునీటి సౌకర్యం కల్పించేందుకు నీటి కుంటలు, చెక్ డ్యాంలను నిర్మించాలన్నారు. రైతులు, గ్రామ సంఘాల ఆధ్వర్యంలో పశు గ్రాసం సాగు చేస్తే ఎకరానికి రూ.14వేల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఆర్‌డీవో దత్తారాం, డీపీఏ భిక్షపతి, డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.