జల సంరక్షణపై దృష్టి..
ABN , Publish Date - Jul 29 , 2026 | 01:05 AM
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నుంచి రైతులను, కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం వీబీజీరామ్‌జీ పథకాన్ని సద్వినియోగం చేసు కోవాలని భావిస్తున్నది. ఒకవైపు నీటి సంరక్షణ చర్యలు చేపడుతూనే, మరోవైపు వ్యవసాయ కూలీలకు పనులు కల్పించేందుకు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నుంచి రైతులను, కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం వీబీజీరామ్‌జీ పథకాన్ని సద్వినియోగం చేసు కోవాలని భావిస్తున్నది. ఒకవైపు నీటి సంరక్షణ చర్యలు చేపడుతూనే, మరోవైపు వ్యవసాయ కూలీలకు పనులు కల్పించేందుకు కార్యాచరణ రూపొందించింది. నీటి సం రక్షణలో భాగంగా ‘జలసిరి’ కార్యక్రమం ద్వారా నిర్ధే శించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రతీ గ్రామంలో రోజుకు 60 మంది కూలీలకు వీబీజీరామ్‌జీ ద్వారా ఉపాధి పనులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వీబీజీరామ్‌జీగా పేరు మార్చిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని మొదట రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించినా అమలు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తన వాటాను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించగా, రాష్ట్ర ప్రభుత్వాల వాటాను 10 నుంచి 40 శాతానికి పెంచింది. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 100 నుంచి 125 పని దినాలకు పెంచారు. 2026-27 సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల పని దినాల లక్ష్యాన్ని విధించగా, జిల్లాకు పని దినాలను కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం 3825.31 కోట్ల బడ్జెట్ రాష్ట్రానికి కేటాయించింది. కూలీల వేతనాల కోసం 3481.04 కోట్లు, మెటీరియల్ కంపోనెంట్ కింద 2,320.69 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ పథకం ద్వారా సాధారణంగా చేపట్టే పనులే గాకుండా జలసిరి పనులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫ నీటి సంరక్షణే లక్ష్యం..
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊట కుంటలు, బోర్ బావులను రీచార్జీ చేయాలని నిర్ణయించారు. ఈ పనులు చేపట్టడం వల్ల కూలీలకు పనులు కల్పించడమే గాకుండా భూగర్భ జలాలు అడుగంటి పోకుండా అప్పుడప్పుడు కురిసే వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు తోడ్పడనున్నాయని జలసిరి పనులను చేపడుతున్నారు. జిల్లాలో 46 వేల ఇంకుడు గుంతలు, 1,144 పంట కుంటలు, 230 ఊట కుంటలు, 230 బోర్‌వెల్స్ రీచార్జీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆ మేరకు కలెక్టర్ సహ సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పురమాయిస్తు న్నారు. ఈ నెల 24న జిల్లాలోని 263 గ్రామ పంచా యతీల్లో చేపట్టిన ఉపాధిహామీ పనులకు 4755 మంది కూలీలు హాజరయ్యారు. ఒక్కో గ్రామానికి సరాసరి 18 మంది హాజరయ్యారు. ఈ సంఖ్యను 60కి పెంచాలని ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్నది. ప్రతీ గ్రామంలో రోజుకు 60 మందికి తగ్గకుండా 15,780 మంది కూలీలు పనులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోజు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు మండల, గ్రామ స్థాయి ఉద్యోగులతో వీడియో, టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహి స్తూ జలసిరి పనుల్లో వేగం పెంచాలని నిర్ణయించారు. ఈ నెల నుంచి అక్టోబర్ వరకు ప్రధానంగా రోజు వారి కూలీల సంఖ్య పెంచితేనే అనుకున్న ఫలితాలు సాధిం చవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమ యంలోనే వర్షాలు పడతాయని ఆ వర్షాలతో భూగర్భ జలాలు అడుగంటి పోకుండా ఉండి ఖరీఫ్‌లో సాగు చేసే పంటలకు సాగు నీరు, ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంటాయని ప్రభుత్వం చెబు తున్నది. ఈ నెలలో జలసిరి పనులు ముందుకు సాగక పోగా, వాటిపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి ముందుకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.