Share News

Promotions: ట్రెజరీలో ఐదేళ్ల నుంచి ఆగిన పదోన్నతులు

ABN , Publish Date - Jan 08 , 2026 | 03:26 AM

రాష్ట్ర ఆర్థిక శాఖ పరిధిలోని ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ డైరెక్టరేట్‌ కింద పని చేస్తున్న అధికారులకు ఐదేళ్ల నుంచి పదోన్నతులు లేవు. పదోన్నతుల కోసం ‘గెజిటెడ్‌ సర్వీస్‌ రూల్స్‌ సవరణ’ ....

Promotions: ట్రెజరీలో ఐదేళ్ల నుంచి ఆగిన పదోన్నతులు

  • గతంలో నిబంధనల సవరణ .. న్యాయశాఖ తిరస్కరణ

హైదరాబాద్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక శాఖ పరిధిలోని ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ డైరెక్టరేట్‌ కింద పని చేస్తున్న అధికారులకు ఐదేళ్ల నుంచి పదోన్నతులు లేవు. పదోన్నతుల కోసం ‘గెజిటెడ్‌ సర్వీస్‌ రూల్స్‌ సవరణ’ ఫైలును ప్రభుత్వానికి పంపించగా.. న్యాయ శాఖ కొర్రీలు వేసి, తిరిగి డైరెక్టరేట్‌కే పంపించింది. దీంతో పదోన్నతులకు బ్రేక్‌ పడి, ఐదేళ్లుగా ముందుకు సాగడం లేదు. అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌(ఏటీవో), అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(ఏఏవో) పోస్టులను.. జిల్లాల్లో పని చేసే సబ్‌ ట్రెజరీ ఆఫీసర్‌(ఎ్‌సటీవో)లు, డైరెక్టరేట్‌లో పనిచేసే జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(జేఏవో)లకు పదోన్నతుల ద్వారా భర్తీచేస్తారు. కొన్నింటిని ప్రత్యక్ష ఎంపిక(డీఆర్‌) విధానంలో కూడా భర్తీ చేస్తారు. ఇదివరకు తెలంగాణలో ఉన్న ఒకే ఒక మల్టీ జోన్‌లో ‘20 పోస్టుల సైకిల్‌’ను పరిగణనలోకి తీసుకుని పదోన్నతులు ఇచ్చేవారు. అంటే 14 పోస్టులను పదోన్నతుల ద్వారా, మిగతా 6పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసేవారు. కానీ, కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చాక రాష్ట్రాన్ని రెండు మల్టీ జోన్లు, 33 జిల్లాలుగా మార్చారు. మల్టీ జోనల్‌ పోస్టులైన ఏటీవో, ఏఏవోలను ‘20 పోస్టుల సైకిల్‌’తోనే భర్తీ చేసేలా ‘గెజిటెడ్‌ సర్వీస్‌ రూల్స్‌’ను సవరించిన ఫైలును డైరెక్టరేట్‌ ఆర్థిక శాఖకు పంపించింది. ఆర్థిక శాఖ ఈ రూల్స్‌లో మరిన్ని సవరణలు చేసి, ఒక్కో మల్టీ జోన్‌కు 20పోస్టుల చొప్పున సైకిల్‌ను ప్రతిపాదిస్తూ న్యాయశాఖకు పంపించింది. దీనికి న్యాయ శాఖ అంగీకరించలేదు. రెండు మల్టీ జోన్లను కలిపి 40పోస్టుల సైకిల్‌ను తీసుకుంటే మొత్తం 28 ఖాళీలు ఏర్పడితేనే పదోన్నతుల ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. కానీ, ఒకేసారి రెండు మల్టీ జోన్లకు కలిపి 28 ఖాళీలు ఏర్పడవని, అలాంటప్పుడు పదోన్నతులు ఎలా లభిస్తాయని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కూడా రెండు మల్టీ జోన్లకు కలిపి పాత 20 పోస్టుల సైకిల్‌ చొప్పున్నే పరిగణలోకి తీసుకొని పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jan 08 , 2026 | 03:26 AM