Share News

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామని ఐదుగురు విద్యార్థుల ఆత్మహత్య

ABN , Publish Date - Apr 14 , 2026 | 04:51 AM

పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామనే మనస్తాపంతో మరో ఐదుగురు ఇంటర్మీడియట్‌ విద్యార్థులు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు...

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామని ఐదుగురు విద్యార్థుల ఆత్మహత్య

  • సంగారెడ్డి, నిర్మల్‌, సిద్దిపేట జిల్లాల్లో ఘటనలు

మనూరు/నాగల్‌గిద్ద, నర్సాపూర్‌(జి), సిద్దిపేట క్రైం, ఖానాపూర్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామనే మనస్తాపంతో మరో ఐదుగురు ఇంటర్మీడియట్‌ విద్యార్థులు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంగారెడ్డి, నిర్మల్‌, సిద్దిపేట జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం ఎన్‌.జి.హుక్రాన గ్రామ ఉపసర్పంచ్‌ ప్రేమ్‌కుమార్‌ కుమారుడు రమేశ్‌ (17) నల్లవాగు గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం (బైపీసీ) చదువుతున్నాడు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఫెయిల్‌ అయ్యానని తెలుసుకొని, మనస్తాపానికి గురై గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకున్నాడు. అదే జిల్లాలోని నాగల్‌గిద్ద మండలం కారముంగి గ్రామానికి చెందిన అంబిగర్‌ నందిని (17) హైదరాబాదులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. పరీక్షల్లో 470కి గాను 325 మార్కులు వచ్చినప్పటికీ ఫెయిల్‌ కావడంతో తీవ్ర మనస్తాపం చెంది ఉరేసుకుంది. మరో ఘటనలో నిర్మల్‌ జిల్లా నర్సాపుర్‌ మండలంలోని గొల్లమాడకు చెందిన గొల్ల మణివర్ధన్‌ చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా అల్లిపుర్‌లోని కేజీవీబీలో ఇంటర్‌ (సీఈసీ) మొదటి సంవత్సరం చదువుతున్న రంగనాయకపురం గ్రామానికి చెందిన పొట్ల ప్రత్యూష (17) ఉరి వేసుకుంది. నిర్మల్‌ జిల్లా ఖానాపుర్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సత్తనపల్లికి చెందిన భూక్యా ఆకాశ్‌ (18) ఆదివారం డీజే ఆపరేట్‌ చేయడానికి వెళ్లాడు. అక్కడ జరిగిన గొడవతో పాటు పరీక్షల్లో తప్పడంతో మనస్తాపానికి గురై రాత్రి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated Date - Apr 14 , 2026 | 04:51 AM