Family Reunion: ఐదు తరాల ఆత్మీయ బంధం!
ABN , Publish Date - Jan 14 , 2026 | 07:08 AM
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో.. బంధుత్వాలు తగ్గిపోతున్న తరుణంలో, ఎర్రబోరుకు చెందిన ఆ కుటుంబం మాత్రం తమ మూలాలను వెతుక్కుంటూ ఒక్కటయ్యారు.
ఒకేచోట చేరిన 192 మంది కుటుంబసభ్యులు
దుమ్ముగూడెం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): నేటి ఉరుకుల పరుగుల జీవితంలో.. బంధుత్వాలు తగ్గిపోతున్న తరుణంలో, ఎర్రబోరుకు చెందిన ఆ కుటుంబం మాత్రం తమ మూలాలను వెతుక్కుంటూ ఒక్కటయ్యారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ఐదు తరాలకు చెందిన 192మంది కుటుంబ బలగం ఒకచోట చేరి తమ పూర్వీకులను స్మరించుకంటూ, ఆత్మీయ ఆలింగనాలతో సందడి చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నడికుడి కాళికా మాత ఆలయం ఈ అరుదైన ఆత్మీయ సమ్మేళనానికి వేదికైంది. దుమ్ముగూడెం మండలం ఎర్రబోరుకు చెందిన కొమరం వీరయ్య, బుచ్చమ్మ దంపతులు ఈ కుటుంబానికి మూల పురుషులు. కాలక్రమంలో వారి సంతానం ఇలా ఐదు తరాలకు విస్తరించింది. ప్రస్తుతం వీరందరూ వివిధ ప్రాంతాల్లో స్థిరపడి, రకరకాల ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల్లో నిమగ్నమయ్యారు. తమ మూలాలు మర్చిపోకూడదనే సంకల్పంతో ఈ ఏడాది అందరూ ఒకచోట కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. సంక్రాంతి సెలవులు కూడా కలిసిరావడంతో మంగళవారం ఐదు తరాల వారు కాళికామాత ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా గడిపారు.