నేటి రాత్రి నుంచి చేప ప్రసాదం పంపిణీ
ABN , Publish Date - Jun 08 , 2026 | 06:58 AM
మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆస్తమా రోగులకు చేప మందు పంపిణీ చేయడానికి బత్తిని కుటుంబసభ్యులు అంతా సిద్ధం చేశారు.
రేపటి వరకు కొనసాగింపు
అఫ్జల్‌గంజ్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆస్తమా రోగులకు చేప మందు పంపిణీ చేయడానికి బత్తిని కుటుంబసభ్యులు అంతా సిద్ధం చేశారు. సాధారణంగా ప్రతి ఏటా మృగశిర కార్తె ఉదయం పూట ప్రవేశిస్తుంది. అయితే ఈసారి ఈ నెల 8వ తేదీ రాత్రి మృగశిర కార్తె వస్తుండడంతో సోమవారం రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు రాత్రి వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని బత్తిని గౌరిశంకర్ గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం తయారీలో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు దూద్‌బౌలిలోని బత్తిని గౌరిశంకర్ గౌడ్ నివాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం ఉదయం చేప ప్రసాదాన్ని తయారుచేసిన అనంతరం దూద్‌బౌలిలోని స్వగృహంలో బత్తిని కుటుంబసభ్యులంతా దాన్ని తీసుకున్నాక ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పంపిణీ ప్రారంభమవుతుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఉబ్బసం రోగులకు, వారి సహాయకులకు మూడు రోజులపాటు వసతి, భోజనం, మంచినీళ్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.